VC Sajjanar: ఐబొమ్మ, బెప్పం వంటి వాటితో సినిమా ఇండస్ట్రీని తీవ్ర నష్టం చేకూర్చుతూ.. పోలీసులకు సైతం సవాల్ విసిరిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని, హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సజ్జనార్ అండ్ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తోంది సినీ ఇండస్ట్రీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కింగ్ నాగార్జున (Nagarjuna), దర్శకధీర రాజమౌళి (Rajamouli), దిల్ రాజు (Dil Raju) వంటి వారు పోలీసులను అభినందిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఐబొమ్మ రవికి సంబంధించి సీపీ సజ్జనార్ ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఇదంతా చేసింది వైజాగ్‌కు చెందిన వ్యక్తిగా చెబుతూ.. ఆయన ప్రస్తుతం భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో నివసిస్తున్నట్లుగా తెలిపారు. 1972లో విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ మూవీ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘ఓజీ’ వరకు మొత్తం 21వేల సినిమాలు అతడి వద్ద ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. అంతేకాదు, 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా కూడా రవి వద్ద ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమని సజ్జనార్ పేర్కొన్నారు. ఇంకా సజ్జనార్ మాట్లాడుతూ..
Also Read- Akhanda 2 Thaandavam: సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ వస్తోంది.. ఎప్పుడంటే?
ఐబొమ్మ రవి అరెస్ట్‌తో వెలుగులోకి కీలక అంశాలు
‘‘ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి స్వస్థలం విశాఖ. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు. హ్యాకింగ్ వైపు దృష్టి పెట్టిన రవి.. మొదటి నుంచి నేర ప్రవృత్తితోనే ఉన్నాడు. ఒకానొక టైమ్‌లో సినీ ఇండస్ట్రీ అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు.. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఆ వెంటనే ఆయన భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరుగుతూ ఉండేవారు’’ అని సజ్జనార్ తెలిపారు.
Also Read- Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!
కరేబియన్ పౌరసత్వం కోసం రూ. 80 లక్షలు
‘‘2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న ఇమ్మడి రవి.. అదే సంవత్సరం కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అందుకోసం రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వం పొందాడు. 2022 నుంచి కరేబియన్ దీవుల్లో ఉంటున్న ఐబొమ్మ రవి, భారత్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకోవడానికి వచ్చాడు. మూడు రోజుల క్రితం భారత్‌లో అడుగుపెట్టిన రవి.. హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న తన ఆస్తులను అమ్మే యోచనలో ఉన్నాడు. అందుకుగానూ ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2022కు ముందు ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. టెక్నాలజీ పరంగా దిట్ట కావడంతో ఐబొమ్మను క్రియేట్ చేసిన రవి, OTT కంటెంట్‌ను DRM టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అందులో అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాడు. మూవీ రూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని HDలోకి మారుస్తున్నాడు. దాదాపు 60 వెబ్‌సైట్లు క్రియేట్ చేసి పైరసీ కంటెంట్‌ను పోస్టు చేస్తున్న రవి, ఇప్పటి వరకు రూ. వందల కోట్లు సంపాదించి.. కరేబియన్ దీవుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
