Bunker Beds: రాష్ట్రంలోని కేజీబీవీల్లోని విద్యార్థినుల ఇబ్బందులు తొలగనున్నాయి. కేజీబీవీల్లో ప్రస్తుతం నేలపై చాప వేసుకుని విద్యార్థులు నిద్రిస్తున్నారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వారికి బంకర్ బెడ్లను అందించేందుకు ప్లాన్ చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విద్యాశాఖ నుంచి అన్ని ప్రపోజల్స్ సర్కార్‌కు వెళ్లాయి. కాగా ఆర్డర్లు సైతం ఇచ్చినట్లు తెలుస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని కేజీబీవీలకు వీటిని పంపించనున్నారు. ఇదెలా ఉండగా బంకర్ బెడ్లు అయితే స్పేస్ కూడా వృథా కాకుండా ఉండే ఆస్కారమున్న నేపథ్యంలో వీటినే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సైతం అక్కడి ప్రభుత్వం 352 కేజీబీవీల్లోని విద్యార్థినుల కోసం బంకర్ బెడ్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా అదేబాటలో నడుస్తున్నది.
తెలంగాణ వ్యాప్తంగా 495 కేజీబీవీల్లో…
తెలంగాణ వ్యాప్తంగా 495 కేజీబీవీలు ఉన్నాయి. దాదాపు అన్ని కేజీబీవీల్లో విద్యార్థినులు గదుల్లో చాపలపైనే నిద్రపోతున్నారు. వారికి బంక్ బెడ్లు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. దాదాపు రూ.40 కోట్లతో త్వరలోనే వాటిని సరఫరా చేయనున్నారు. ఇదిలా ఉండగా కేజీబీవీల్లో సుమారు 1.25 లక్షల మంది బాలికలు చదువుతున్నారు. అన్ని విద్యాలయాల్లో సరిపడా మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, తాగునీటి వసతి కోసం సంపులు, ప్రహరీ నిర్మాణం తదితర సౌకర్యాల కోసం రూ.243 కోట్లను ఖర్చు చేయనున్నారు. నిర్మాణాల బాధ్యతను తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలికాభివృద్ధి సంస్థకు అప్పగించారు. కాగ వచ్చే 2026–-27 విద్యా సంవత్సరం నాటికి ఈ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ ఆదేశించింది. తెలంగాణలోని 495 కేజీబీవీల్లో 283 ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ వరకు విద్య అందుతున్నది. అందులోనూ ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే 120 కేజీబీవీల్లో ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కేజీబీవీలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల బలోపేతంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా గురుకులాల తరహాలోనే ఈ సంవత్సరం 93 కేజీబీవీలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా మార్చింది. వాటిల్లో ఇంటర్ విద్యార్థులకు కొద్దిరోజులుగా జేఈఈ మెయిన్, నీట్, క్లాట్, ఈఏపీసెట్ తరగతులను ఫిజిక్స్ వాలా సంస్థ ద్వారా ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్నారు. కేజీబీవీలను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సర్కార్, విద్యశాఖ భావిస్తున్నది. అందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ 93 కేజీబీవీల్లో టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఇంటర్ సీట్లు భర్తీ చేయనున్నారు. క్రమంగా ఈ విధానాన్ని మిగతా కేజీబీవీల్లోనూ విస్తరించాలని ప్రయత్నాలు చేపడుతున్నారు. మరి సర్కార్ అనుకున్న లక్ష్యాలను అధిగమించి విద్యావ్యవస్థను పటిష్టంగా చేస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.
Also Read: Cyber Crime: ఓరి నాయనా ఐటీ కమిషనర్‌కే టోపి పెట్టిన సైబర్ నేరగాళ్లు..40 వేలు స్వాహ..!
