IBomma: ఐ బొమ్మ (బప్పం) వెబ్ సైట్ కు తెరపడింది. దీని నిర్వాహకుడు ఇమ్మడి రవి(Ravi)ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు అతని నుంచి వెబ్ లాగిన్స్ తోపాటు సర్వర్ వివరాలు తెలుసుకుని వెబ్ సైట్ ను మూసివేశారు. దాంతో ఈ వెబ్ సైట్ ప్రస్తుతం ఓపెన్ కావటం లేదు. కాగా, రవిని వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ నేడు సైబర్ సెల్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
సవాల్ చేసి కటకటాల్లోకి..
దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దామంటూ రవి(Ravi) పోలీసులకు సవాల్ విసురుతూ కొంతకాలం క్రితం ఓ వీడియో(Video)ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నా వెబ్ సైట్ జోలికి వస్తే అందరి బతుకులు బయట పెడతానంటూ రవి బెదిరింపులు కూడా చేశాడు. కోట్లాది మంది డేటా తన వద్ద ఉందని.. నన్ను టార్గెట్ చేస్తే ఏం చేయాలో తెలుసంటూ హెచ్చరికలు చేశాడు. దీనిని సైబర్ క్రైం పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. పైరసీ కేసులో గతంలో అరెస్ట్ చేసిన నిందితుల నుంచి రవికి సంబంధించిన కీలక వివరాలు తెలుసుకున్నారు. వీటి ఆధారంగా అతనిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి వచ్చి కూకట్ పల్లిలోని రెయిన్ విస్టా అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లో ఉన్న రవిని అరెస్ట్ చేశారు.
Also Read: KTR: భవిష్యత్ లో జూబ్లీహిల్స్ లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం : కేటీఆర్
వెబ్ సైట్ క్లోజ్..
దాడి సమయంలో రవి ఫ్లాట్ నుంచి కంప్యూటర్లు(Computers), మార్డ్ డిస్కులు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రవి నుంచి వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలు తీసుకున్నారు. వీటి ద్వారా ఐ బొమ్మ వెబ్ సైట్ ను క్లోజ్ చేసేశారు. ఇక, శనివారం రాత్రి రవిని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ నివాసంలో హాజరు పరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో చెంచల్ గూడ జైలుకు తరలించారు. పైరసీ రాకెట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రవిని వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అభినందించిన ఆనంద్..
ఐ బొమ్మ వెబ్ సైట్(I Bomma website) నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులను ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న హైదరాబాద్ మాజీ కమిషనర్ సీ.వీ.ఆనంద్(CV Anand) అభినందించారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరిన రవికి సరైన సమాధానం ఇచ్చారంటూ హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్(CP V.C. Sajjanar), సైబర్ క్రైం డీసీపీ దార కవిత(DCP Kavitha)లను ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
