KCR silent
Politics

BRS Party: గులాబీ వల‘సలసల’

– తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం
– ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు
– ఎట్టకేలకు సైలెన్స్ బ్రేక్ చేసిన కేసీఆర్
– ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో కీ మీటింగ్
– ఎవరూ తొందరపడొద్దంటూ సూచన
– ఢిల్లీలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
– బీఆర్ఎస్‌లో ఉండేదెవరు? పోయేదెవరు?

Defections: ఎట్టకేలకు కేసీఆర్ సైలెన్స్ బ్రేక్ చేశారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జంప్ అవుతుండడంతో ఫాంహౌస్‌లో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఆరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్ హాజరయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు, మీటింగ్‌కు హాజరైన నేతల్లో కూడా ఎవరు ఉంటారో, ఎవరు పోతారో అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.

విడివిడిగా చర్చలు.. బుజ్జగింపులు

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విడివిడిగా చర్చలు జరిపిన కేసీఆర్, పార్టీ విడిచిపెట్టి వెళ్ళొద్దని వారిని కోరారు. బీఆర్ఎస్ బీ ఫామ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎందుకు పార్టీ మారుతున్నారని వారితో చర్చించారు. ఈ సందర్భంగా పదేళ్లలో పార్టీలో జరిగిన అవమానాలను వివరించారు ఎమ్మెల్యేలు. ఇక నుండి అలాంటి పరిస్థితులు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు. కీలక పోస్టుల్లో మార్పులపై నిర్ణయాలను వారికి వివరించారు. పార్టీ మారే ఎమ్మెల్యేల ఆలోచనపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎవరూ తొందరపడొద్దని, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారటంపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పరిణామాలు ఒకనాడు వైఎస్ హయాంలోనూ జరిగాయని గుర్తు చేశారు. అయినా, భయపడకుండా ముందుకు సాగినట్టు వివరించారు.

సర్కారుపై విసుర్లు

సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు కేసీఆర్. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, భవిష్యత్తులో మనకు‌ మంచి రోజులు వస్తాయంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్‌కు వచ్చే నష్టం లేదని చెప్పిన కేసీఆర్, ఇవాళ్టి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఎవరు ఉంటారో.. అన్నీ అనుమానాలే!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించగా, ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అలాగే, ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. దీంతో సంఖ్యా బలం 33కు పడిపోయింది. వీరిలో కనీసం ఐదారుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సమావేశానికి వెళ్లిన వారిలో కూడా ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఢిల్లీలో గూడెం మహిపాల్ రెడ్డి

ఈమధ్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. అదే దారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏఐసీసీ పెద్దల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరిగాయి. దానికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్లారా? లేదా, కాంగ్రెస్‌లో చేరేందుకు వెళ్లారా? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?