Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తమకు లేదా బంధువులు, మిత్రులకు ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ఐఆర్‌సీటీసీలో పర్సనల్ అకౌంట్‌ల ద్వారా తమకు కాకుండా వేరే ఎవరికైనా టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇది అవాస్తవం అని తాజాగా రైల్వే శాఖ తెలిపింది. పర్సనల్ యూజర్ ఐడీతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు.. ఎవరికైనా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ఒక్క ఐడీతో నెలకు 12 టికెట్లు పొందొచ్చని, ఆధార్ అనుసంధానమైతే నెలలో 24 టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉన్నదని తెలిపింది. అయితే, వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ టికెట్లు బయట అమ్ముకోరాదని పేర్కొంది. ఎందుకంటే ఇవి వాణిజ్యపరమైన విక్రమం కోసం ఉద్దేశించినవి కావని తెలిపింది. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టరీత్య చర్యలకు అర్హులని హెచ్చరించింది.