జీవన్ రెడ్డితో చర్చలు సఫలం!
– డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ
– పార్టీ వీడను.. ఎమ్మెల్సీకి రాజీనామా: జీవన్ రెడ్డి
Deputy CM Bhatti: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తాను కాంగ్రెస్ పార్టీని వీడనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశాన్ని సస్పెన్స్‌లోనే పెట్టారు. జీవన్ రెడ్డిని తాము వదులుకోమని, కష్టకాలంలో కాంగ్రెస్ జెండా భుజాన మోసి పార్టీ భావజాలాన్ని ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. సీనియర్ నాయకుడైనా జీవన్ రెడ్డి అనుభవాన్ని తాము సమర్థంగా వినియోగించుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాన్ని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు తనకు ముందుగా తెలియజేయలేదని, తనతో సంప్రదింపులు జరపలేదని నిరసన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సంజయ్ చేరికను తీవ్రంగా వ్యతిరకిస్తూ నిరసనలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపం చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్‌లు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని బుజ్జగింపులు చేశారు.
కాగా, మంగళవారం కూడా కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు బేగంపేట్‌లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, 1980ల నుంచే చట్టసభల్లో పార్టీ గళం వినిపించిన నాయకుడని వివరించారు. తమ అందరికీ ఆయన మార్గదర్శకులని, రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి జీవన్ రెడ్డి అనుభవాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్న పది సంవత్సరాలు పార్టీ జెండాను మోసి క్యాడర్‌ను కాపాడిన నాయకుడని ప్రశంసించారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి భంగం కలగకుండా, పార్టీ ఆయనకు సముచిత స్థానం, ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తుందని వివరించారు. సీనియర్ నాయకులను పార్టీ ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్ నాయకులు మనస్థాపం చెందితే తామంతా బాధపడతామని తెలిపారు. మంత్రులతోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్‌లు జీవన్ రెడ్డితో మాట్లాడారు.
జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడ్డానని, ఇక పైనా పార్టీలోనే ఉంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. చేరికల విషయంలో తాను మనస్తాపం చెందానని తెలిపారు. అయితే, ఎమ్మెల్సీ పదవి విషయంలో కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మండలి చైర్మన్ అందుబాటులో లేరని, అందుబాటులోకి వచ్చాక నిర్ణయాన్ని అమల్లో పెడతానని వివరించారు.