Naveen Yadav: ఓటమి గెలుపునకు నాంది అంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయఢంకా మోగించిన నవీన్ యాదవ్ విషయంలో ఈ నానుడి నిజమైంది. కార్పొరేటర్(Corporator) గా, ఎమ్మెల్యే(MLA)గా ఆయన నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి పాలైనా చెక్కు చెదరని విశ్వాసంతో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 16 ఏళ్ల క్రితం రాజకీయ ఆరంగేట్రం చేసిన నవీన్ యాదవ్(Naveen Yadav) ఫస్ట్ టైమ్ 2009లో యూసుఫ్ గూడ కార్పొరేటర్ గా మజ్లీస్ పార్టీ నుంచి పోటీ చేసి అపజయం పాలయ్యారు.
మళ్లీ అపజయం..
ఆ తర్వాత 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ అపజయం పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 18 వేల 818 ఓట్లు మాత్రమే పొందారు. మరోసారి 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ యూసుఫ్ గూడ కార్పొరేటర్ గా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అపుడు కూడా ఆయన్ను ఓటమే వెంటాడింది. వరుస ఓటముల పాలైన నవీన్ యాదవ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, అపుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అజారుద్దిన్ కు మద్దతు పలికారు. అయినా అజారుద్దిన్ కూడా అపజయం పాలయ్యారు. ఇపుడు తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఓ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నవీన్ యాదవ్ ఎంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ టికెట్ సంపాదించుకోవటంతో పాటు బై ఎలక్షన్ లో అనూహ్యాంగా విజయం సాధించారు.
Also Read: KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే
వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో పార్టీల వారీగా దక్కిన ఓట్లు
2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,83,312 ఓట్లు పోలింగ్ కాగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాధ్ మొత్తం 80 వేల 549 ఓట్లు సాధించగా, 16 వేల 337 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దిన్ పై గెలుపొందారు. అజారుద్దిన్ కు 64 వేల 212 ఓట్లు పోలయ్యాయి. వీరిలో గోపీనాధ్ కు 43.94 శాతం ఓట్లు పోలవ్వగా, అజారుద్దిన్ కు 35.03 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 25 వేల 866 (14.11 శాతం) ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2018 లో జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం లక్షా 54 వేల 148 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాధ్ కు 44.8 శాతం 68 వేల 979 ఓట్లు దక్కగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పి. విష్ణువర్థన్ రెడ్డికి 34.4 శాతం 52 వేల 975 ఓట్లు దక్కాయి. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డికి 5.5 శాతం 8517 ఓట్లు మాత్రమే వచ్చాయి. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి విష్ణువర్థన్ రెడ్డిపై మాగంటి గోపీనాధ్ 16 వేల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్ కు 12.2 శాతం 18 వేల 817 ఓట్లు వచ్చాయి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి గోపీనాధ్, ఎంఐఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో మాగంటి గోపీనాధ్ 30.78 శాతం 50 వేల 898 ఓట్లు దక్కించుకోగా, ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ కు 41 వేల 656 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్థన్ రెడ్డి కి 20.35 శాతం 33 వేల 642 ఓట్లు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జి. రాజమౌలి కి 11.15 శాతం 18 వేల 436 ఓట్లు పోలయ్యాయి.
