Severe Cold Wave: గతవారం రోజుల నుంచి చలితో వణికిపోతున్న తెలంగాణ (Telangana) ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదీలకు రాబోయే ఆరు రోజుల పాటు కూడా ఎలాంటి ఉపశమనం దక్కదు. చలి తీవ్రత మరింత పెరిగి వణికించబోతోంది. హైదరాబాదీలారా (Hyderabad), వచ్చే ఆరు రోజులలో చలి విషయంలో రిలీఫ్ ఉండబోదంటూ ‘హైదరాబాద్ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) హెచ్చరించింది. ఈ సీజన్‌లో ఇది చాలా, చాలా సుదీర్ఘమైన చలి కానుందని అప్రమత్తం చేసింది. ఉష్ణోగ్రతలు మళ్లీ వేగంగా పడిపోతున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి తగ్గకుండా ఉంటుంది కాబట్టి, స్వెట్టర్లను సిద్ధంగా ఉంచుకోండంటూ ‘హైదరాబాద్ వెధర్‌మ్యాన్’ సూచన చేసింది.
నవంబర్ కోల్డ్ వేవ్‌లో తీవ్రమైనది
సాధారణంగా నవంబర్ నెలలో చలికాలం ప్రారంభమవుతుంది. కానీ, ప్రస్తుతం నెలకొన్న కోల్డ్ వేవ్ నవంబర్ నెల సీజన్‌లోనే (Severe Cold Wave) అత్యంత తీవ్రమైనదని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ ట్వీటర్ పేజీ పేర్కొంది. తెలంగాణలో ఇది అత్యంత తీవ్రమైన నవంబర్ కోల్డ్ వేవ్‌లలో ఒకటిగా కన్ఫార్మ్ అయినట్టు పేర్కొంది. తీవ్రమైన చలి వాతావరణం 6 రోజుల క్రితం ప్రారంభమైందని, అయితే, గరిష్ఠ స్థాయి చలికాలం వేవ్ మాత్రం 2 రోజుల క్రితం మొదలైందని తెలిపింది. రాబోయే 4 రోజులపాటు రాష్ట్రమంతా దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఆ తర్వాత 3 రోజులు పాటు కూడా తీవ్రమైన చలి వాతావరణం కొనసాగుతుందని అప్రమత్తం చేసింది. ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే, 2018 నాటి నవంబర్ కోల్డ్ వేవ్ మాదిరిగా కనిపిస్తోందని ప్రస్తావించింది. ఏడేళ్ల తర్వాత తిరిగి ఒక బలమైన కోల్డ్ వేవ్‌గా మారుతోందని పేర్కొంది.
సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
గత కొన్ని రోజులుగా తెలంగాణ అంతటా అత్యుల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నాడు సంగారెడ్డిలో 7.8 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్‌లో 8.3, రంగారెడ్డిలో 8.8, మెదక్‌లో 9.0, సిరిసిల్లలో 9.1, ఆదిలాబాద్‌లో 9.3, కామారెడ్డిలో 9.4, నిజామాబాద్‌లో 9.4, నిర్మల్‌లో 10.8, కరీంనగర్‌లో 11.5, మంచిర్యాలలో 12, హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నంలో కూడా 8.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, హెచ్‌సీయూ 8.8 డిగ్రీలు, నగరంలోని మిగతా ప్రాంతాలలో 10-15 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులపాటు కూడా ఇదే స్థాయిలో ఇదే విధంగా స్వల్పస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది.
