Jogipet: జోగిపేట పట్టణంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసును స్థానిక పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. పట్టణంలోని సత్యసాయి కాలనీలో రిటైర్డ్ టీచర్ సదాశివగౌడ్ అత్త అయిన శంకరంపేట మాణెమ్మ మెడలోంచి దొంగిలించబడిన నాలుగు తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
Also Read: Jogipet: జోగిపేటలో పట్టపగలు చోరీ.. మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన దొంగ!
పోలీసులు వెంటనే రంగంలోకి
ఉదయం పూట బాధితురాలు మాణెమ్మ మందుల కోసం మెడికల్ షాపునకు వెళ్లింది. స్థానిక హనుమాన్ చౌరస్తా వద్ద ఆమెను గమనించిన నిందితుడు వెంబడించాడు. మహిళ సత్యసాయి కాలనీలోని తన ఇంట్లోకి వెళ్లగానే, వెనకాలే వెళ్లిన దొంగ ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని, వెంటనే ఆమె కళ్లలో కారం చల్లి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. అనంతరం నిందితుడు ఎస్సీ కాలనీ మీదుగా క్రీడా మైదానంలోకి పరుగెత్తి జనంలో కలిసిపోయాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అందోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నవీన్‌గా గుర్తించారు.
బంగారు గొలుసును అదే రోజు రాత్రి పోలీసులు స్వాధీనం
సంఘటన జరిగిన రోజే రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం చేసినట్లుగా అంగీకరించాడు. దొంగిలించబడిన బంగారు గొలుసును అదే రోజు రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నవీన్ డిప్లొమా పూర్తి చేసి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, పటాన్‌చెరువు ప్రాంతాల్లో బిల్డర్ల వద్ద సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా అతడికి 14 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని నవీన్ దొంగతనానికి పాల్పడటం అతడి స్నేహితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ కేసు ఛేదింపులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ పాండు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ అరవింద్, సంజీవ్, సురేశ్‌ను సీఐ అనిల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా పోలీసు బృందానికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందినట్లు తెలిపారు.
Also Read: Jogipet CI: జోగిపేట సీఐ పిస్టల్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు తప్పిన ప్రమాదం
