Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయ కేతనం ఎగురవేసింది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 24 వేలకు పైగా ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను ఓడించారు. నియోజకవర్గంలోని యూసఫ్ గూడాలో గల కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఉపఎన్నికల్లో పోలైన ఒక లక్షా 94 వేల 631 ఓట్లను (48.49 శాతం) 42 టేబుల్స్ లలో 10 రౌండ్లుగా కౌంట్ చేశారు. అయితే ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం సాధించలేకపోయింది. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లైంది.
విజయంపై నవీన్ యాదవ్ రియాక్షన్ ఇవే
జూబ్లీహిల్స్‌లో తన విజయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఈ ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించి, సహకరించిన ఓటర్లు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీకి, పార్టీ నేతలు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మంత్రులు, నేతలు, కార్యకర్తలను ధన్యవాదాలు తెలిపారు. కాగా, నవీన్ యాదవ్ తన నివాసానికి ఊరేగింపుగా వెళ్లి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తారని తెలుస్తోంది.
విజయోత్సవంలో ఎమ్మెల్యే నవీన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఎన్నికల కౌంటింగ్ జరిగిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నుంచి ఆయన నివాసం దిశగా ఊరేగింపుగా తరలి వెళుతున్నారు. దీంతో, వందలాది కార్యకర్తలు ఈ విజయ సంబరాల్లో పాల్గొన్నారు.
గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎన్నికల అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఆర్వో సాయిరాం సర్టిఫికెట్‌ను అందజేశారు.
జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. ‘‘ బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ, ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఆ విషయాల గురించి నేను మాట్లాడను. ఈ ఎన్నిక మాకు కచ్చితంగా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రజలు స్పష్టంగా చెప్పారు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని సానుకూలంగా చూస్తాం. ఈ ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఏవిధంగా పనిచేసిందనేది మీరంతా చూశారు. వాటిలోకి ఎక్కువగా పోను. 2014 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో చాలా ఉపఎన్నికలు జరిగాయి. ఏడు ఉపఎన్నికలు జరిగాయి. పాలేరు, నారాయణఖేడ్, హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజురాబాద్, మనుగోడు.. ఈ అన్ని ఉపఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. హస్తం పార్టీ ఒక్క ఉపఎన్నిక కూడా గెలవలేదు’’ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన తర్వాత ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
హుందాగా పోరాడం
‘‘బీఆర్ఎస్ పార్టీ 5 ఉప ఎన్నికల్లో గెలిచింది. ఒక రెండింట్లో మాత్రం ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉపఎన్నిక గెలవకపోయినా 2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒకటి, రెండు కార్పొరేటర్ స్థానాలు మాత్రమే గెలిచింది. వీటన్నింటినీ ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఈ ఎన్నికలో ప్రజల వాదనను బలంగా వినిపించగలిగాం. ప్రజల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. హామీలను ఎగవేతను బాకీకార్డుల రూపంలో జనాల్లోకి తీసుకెళ్లాం. ప్రజల సమస్యలపై చర్చ జరిగేలా చేశాం. అది బీఆర్ఎస్ సాధించిన విజయంగా భావిస్తున్నాం. మేము అనవసర అంశాల జోలికి పోలేదు. కులం, మతం పేరిట డైవర్సన్ పాలిటిక్స్ చేయలేదు. బూతులు మాట్లాడాలేదు. చాలా హుందాగా కొట్లాడాం. ప్రజలకు అవసరమైన పాయింట్లను చర్చకు పెట్టాం. కాంగ్రెస్, బీజేపీ ఎంత కవ్వించినా సంయమనం పాటించాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also- Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కవిత
ఓటమిపై సునీత స్పందన
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత స్పందించారు. ఒక మహిళపై సీఎం సహా రాష్ట్ర కేబినేట్ మెుత్తం దౌర్జన్యం చేసి గెలిచిందన్నారు. పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరిగాయని ఆరోపించారు. షేక్ పేట, యూసఫ్ గూడ సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదన్న ఆమె.. రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయమని విమర్శించారు.
ముగిసిన ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దాదాపుగా ఖరారైంది. 10 రౌండ్లకు గాను 7 రౌండ్లు పూర్తికాగా ఒకటి మినహా అన్నింట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా 7 రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్.. 19619 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. అయితే 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 50849 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ (37990 ఓట్లు) బీజేపీ (8569 ఓట్లు) వెనుకంజలో ఉన్నాయి.
12 వేల ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్ఫష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 5 రౌండ్లలో ఆయన 12, 651 ఓట్ల మెజారిటీని సాధించారు. కాంగ్రెస్ జోష్ చూస్తుంటే రౌండ్ రౌండ్ కు ఈ ఆధిక్యం మరింత పెరిగేలా కనిపిస్తోంది. మెుత్తంగా చూస్తే ఇప్పటివరకూ కాంగ్రెస్ కు 51,014, బీఆర్ఎస్ కు 38,364, బీజేపీకి 5,361 ఓట్లు వచ్చాయి.
ఐదో రౌండ్ ముగిసేసరికి 12,651 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్#JubileeHillsByElection pic.twitter.com/WQ9oELoXji
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
బీఆర్ఎస్ ఆధిక్యం.. కానీ!
జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రెండు రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్.. మూడో రౌండ్ కు వచ్చేసరికి వెనుక బడింది. ఈ రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత స్వల్ప ఆధిక్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థితో పోలిస్తే.. 211 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించారు. ఈ రౌండ్ లో బీఆర్ఎస్ కు 12,500 ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 12,292 ఓట్లు దక్కాయి. బీజేపీ 401 ఓట్లతో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. మూడో రౌండ్లకు కలిపి లెక్కించిన ఓట్లలో నవీన్ యాదవ్ కు 30,894 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ కు 29,976, బీజేపీకి 2,568 ఓట్లు దక్కాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు
మూడో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో కాంగ్రెస్ #JubileeHillsByElection pic.twitter.com/t59nVUzTIe
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
తొలి రౌండ్.. కాంగ్రెస్ ముందంజ
జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మెుత్తం 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెుదటి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా అందులోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. 62 ఓట్లతో నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మెుదటి రౌండ్ లో కాంగ్రెస్ కు 8892లు ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 8864 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల వర్గాలు ప్రకటించాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సెంటర్ లోపలి దృశ్యాలు
ఈవీఎం ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
మొత్తం 10 రౌండ్లలో తేలనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం #JubileeHillsByElection pic.twitter.com/SFtkI7Iv0M
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
అభ్యర్థి అకస్మిక మృతి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ జరుగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి మహ్మద్ అన్వర్ అకస్మాత్తుగా మృతి చెందారు. గురువారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే అన్వర్.. అక్టోబర్ 22న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం నామినేషన్ వేశారు. దానిని ఈసీ పరిశీలించి ఓకే చేయడంతో.. బరిలో నిలిచారు. అయితే ఫలితాలకు ఒకరోజు ముందు అన్వర్ మృతి చెందడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి!
ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి మృతితో నెలకొన్న విషాదం pic.twitter.com/n7EMiulrMi
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
తొలుత పోస్టల్ బ్యాలెట్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెుత్తం పోలింగ్ స్టేషన్లు 407 ఉండగా ఫస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ – 1 నుంచి ఓట్ల కౌటింగ్ ప్రారంభం కానుంది పోలింగ్ స్టేషన్ 1 నుంచి 42 వరకూ ఉన్న ఈవీఎంలను తొలి రౌండ్ లో తెరిచి లెక్కిస్తారు. ఆ తర్వాత 43-85 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. ఇలా మెుత్తం 407 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 10 రౌండ్లలో లెక్కించి.. ప్రతీ రౌండ్ ఫలితాలను ఈసీ వెల్లడించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనుంది.
3 గంటల కల్లా ఫలితం..
ఓట్లను లెక్కించే సమయంలోని చెల్లని ఓట్లను కూడా అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు చూపి పక్కన పెట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశముందని రాజకీయ నిపుణలు చెబుతుండగా, అసలైన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యనే ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను, శుక్రవారం కౌంటింగ్ జరగనున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి సెంటర్ ఆవరణలో కూడా అమల్లో ఉండనుంది.
Also Read: Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
మెజార్టీ స్వల్పమే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు ఏ అభ్యర్థిని వరించినా అది స్వల్ప మెజార్టీతోనే అన్న అంచనాలున్నాయి. గత 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 19 మంది అభ్యర్థులు, నోటా పోటీలో ఉండగా, మొత్తం 47.58 శాతం ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దిన్ పై 16 వేల 337 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికలో కూడా అధికారులు ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. గతంలో కన్నా స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగి 48.49 శాతంగా (లక్షా 94 వేల 631 ఓట్లు) నమోదయ్యాయి.

