Huzurabad mandal chelpur Hanuman temple 144 section leaders house arrest:
హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రణవ్ బాబు ఛాలెంజ్ చేసుకుని వేదికగా చేసుకున్న స్థానిక హనుమాన్ ఆలయం వద్ద 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు. ఉదయం నుంచే హుజూరాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలెవరినీ ఆలయ పరిసర ప్రాంాతలకు రానీయలేదు. గుడి చుట్టూ పోలీసులు మోహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడకు రాకుండా నిఘా పెట్టారు. కాగా మంగళ వారం ఉదయం గుడి వద్ద ప్రమాణం చేయాలి అని ఛాలెంజ్ చేసుకుని సిద్ధపడ్డ తరుణంలో రాత్రికి రాత్రే కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని, మానుకోటలో రాళ్ళు విసిరిన ద్రోహి అంటూ పోస్టర్లు వెలువడం చర్చనీయాంశంగా మారింది.
పలువురు హౌస్ అరెస్ట్
హుజురాబాద్ నియోజక వర్గంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇరు పార్టీల నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని, కార్యకర్తలు ఎవ్వరూ ఇక్కడకు రావద్దని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు పలువురిపై నిఘా పెట్టడం జరిగిందని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేసినా కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు.