revanth reddy
Politics

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం బిజీ బిజీ

-కేంద్రమంత్రులతో భేటీలు
– ఇళ్ల నిర్మాణాలు, స్మార్ట్ సిటీకి నిధులివ్వండి
– రక్షణ శాఖ భూములు బదలాయించండి
– వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించండి
– ఖట్టర్, రాజ్‌నాథ్ సింగ్‌లకు సీఎం రేవంత్ వినతి

Telangana: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులతో సమావేశమవుతూ బిజీబిజీగా గడిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం తొలి రోజున కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీ అయ్యారు. 2.70 లక్షల ఇల్లను మంజూరు చేయాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనా(యూ) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇళ్లను నిర్మిస్తామని కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం తెలిపారు. స్మార్ట్ సిటీ మిషన్‌కు సంబంధించి నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాలు బదలాయించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలని కోరారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఇందులో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి పరిధిలోకి వస్తాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస యోజన(పట్టణ) కింద మంజూరు చేసే నిధులను పెంచాలని కోరారు. తెలంగాణకు ఇప్పటి వరకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ. 2,390.58 కోట్ల గ్రాంట్‌ ప్రకటించారని, కానీ, కేవలం రూ. 1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, కాబట్టి, మిగితా నిధులను కూడా విడుదల చేయాలని తెలిపారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ పనులు ఇంకా పూర్తి కానందున మిషన్ పరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కోరారు.

రాజధాని నగరం హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్నదని గుర్తు చేసిన సీఎం అందుకు బదులుగా రాష్ట్ర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాలు అప్పగించాలని కోరారు. వరంగల్ నగరానికి గతంలో సైనిక్ స్కూల్ మంజూరైనా.. నిర్మాణ పరంగా గతం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం వివరించారు. కాబట్టి వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున వాటిని పునరుద్ధరించాలని లేదా మళ్లీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు.

Just In

01

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?