Jagtial: జగిత్యాల జిల్లాలో రాజకీయం కాక రేపుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్‌లోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం ఆందోళనలకు దిగాయి. సంజయ్ చేరికతో ఒక వైపు బీఆర్ఎస్‌కు షాక్.. మరో వైపు జగిత్యాల కాంగ్రెస్‌లో చిచ్చు అన్నట్టుగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్‌లు పోటాపోటీగా తలపడ్డారు. ఒక సారి జీవన్ రెడ్డి గెలవగా.. రెండు సార్లు జీవన్ రెడ్డిని సంజయ్ కుమార్ ఓడించారు. జగిత్యాలలో వీరిద్దరూ ప్రత్యర్థులు.. వేర్వేరు పవర్ హౌజ్‌లుగా ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉభయ వర్గాల్లో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి.
బుజ్జగింపులు
సంజయ్ కుమార్ చేరికపై జీవన్ రెడ్డి అలకబూనారు. తనకు పార్టీ నుంచి ముందస్తు సమాచారం రాలేదని వాపోయారు. సంజయ్ కుమార్ చేరికను ఆయన వ్యతిరేకిస్తున్నారు. జీవన్ రెడ్డి అనుచరులు సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసి ఆందోళనలు చేశారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ వెంటనే అప్రమత్తమైంది. ఇద్దరు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్‌లు ఉదయమే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచనలు చేశారు. ఈ విషయమై పార్టీ అధిష్టానం కూడా జీవన్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిసింది.
భగ్గుమన్న బీఆర్ఎస్
ఇక బీఆర్ఎస్ కూడా సంజయ్ కుమార్ పార్టీ మారడంపై తీవ్రంగా స్పందించింది. సంజయ్ కుమార్ దిష్టి బొమ్మ దహనం చేసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని, కల్వకుంట్ల కవిత ఇక్కడ విస్తృత ప్రచారం చేసి సంజయ్ కుమార్‌ను గెలిపించారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సంజయ్ కుమార్ ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఆ తర్వాతే ఏ పార్టీకి అయినా ఆయన వెళ్లొచ్చన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్‌పర్సన్ వసంత, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ ఆందోళన చేపట్టారు.
ఇప్పటికి ఎంత మంది?
బీఆర్ఎస్ టికెట్ పై జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన సంజయ్ కుమార్ ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఐదో ఎమ్మెల్యే ఈయన. ఇది వరకే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డి చేరిన స్వల్ప కాలంలోనే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాంబు పేల్చడంతో గులాబీ శిబిరంలో ఆందోళనలు రెట్టింపవుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఇప్పటికే దానం నాగేందర్ పై అనర్హత కోసం హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్.. సానుకూల తీర్పు రాకుంటే సుప్రీంకోర్టునూ ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
బలాబలాలు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64కి సీట్లు దక్కాయి. హస్తం పార్టీతో పొత్తులో బరిలో దిగిన సీపీఐ ఒక్క సీటు గెలుచుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ 39 స్థానాలు బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు గెలిచాయి. పార్టీ ఫిరాయింపులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 34కు పడిపోగా.. కాంగ్రెస్ బలం 69కి చేరింది. సీపీఐ సీటును కలుపుకుంటే ప్రభుత్వానికి 70 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది.