Harish Rao: రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30 శాతం కమీషన్లను కాంగ్రెస్(Congress) నాయకులు డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందన్నారు. పర్మిషన్లకు, నిర్మాణాలకు కమీషన్లు డిమాండ్ చేయడంతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటున్నదని ఆరోపించారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి, వారి పిల్లలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీకి మధ్య జరుగుతున్నదని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. శుద్ధి చేసిన మంచి నీళ్లను ప్రతి ఇంటికి అందించకపోతే ఓటే అడగను అని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
కేసీఆర్ రాకముందు..
ఎంతోమంది నాయకులు పాలించారు కానీ ఎవరు కూడా కనీసం తాగునీరు అందించలేదన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, మోదీ ఆదర్శంగా తీసుకొని హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 8 ఏళ్లయినా హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాకముందు హైదరాబాద్‌లో ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించామని వివరించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన షీ టీమ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, మహిళలకు భద్రతను పెంచిందన్నారు. పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో దేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి 2023లో 2 కోట్ల 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని పెంచామన్నారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్..
పర్ క్యాపిటా ఇన్కమ్ 2014లో 1,24,000 ఉండేదని, 2023లో 3,74,000తో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందన్నారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి లైన్ కడితే కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతులు లైన్‌లో నిల్చుంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. హైదరాబాద్(Hyderabad)లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమి అమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అసమర్థత పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. ఈరోజు ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని హరీశ్ రావు నిలదీశారు.
Also Read: Jubilee Hills Bypoll: మూగబోయిన మైక్‌లు.. జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారపర్వం
