Andesri death: తెలంగాణ మట్టి వాసనను, పల్లె జీవనాన్ని, ఉద్యమ స్ఫూర్తిని తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, ప్రకృతి కవి డా. అందెశ్రీ (64) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతూ 2025, నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుగు సాహితీ లోకాన్ని, తెలంగాణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామంలో 1961, జూలై 18న జన్మించారు. ఆయన బాల్యం కష్టాలతో కూడుకున్నది. గొడ్లకాపరిగా పనిచేసినా, ఎలాంటి పాఠశాల విద్యను అభ్యసించకపోయినా, అశువుగా కవిత్వం చెప్పడంలో, పాటలు రాయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈయనలోని ప్రతిభను గుర్తించిన శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ ఆయనను చేరదీశారు.
Read also-Sundeep Kishan Movie: సందీప్ కిషన్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. దర్శకుడు ఎవరంటే?
ఆర్ నారాయణ మూర్తి ఎమోషనల్
ప్రజాకవి అందేశ్రీ మరణించారన్న విషయం తెలుసుకున్న ఆర్ నారాయణ మూర్తి ఎమోషన్ అయ్యారు. ప్రజాకవి అందేశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నా చిత్రాలు ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కల కు అమోఘ మైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు ఎంతో దోహదం చేశారు. ఎర్ర సముద్రం లో మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం. ఊరు మనదిరా లోని చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో అమోఘమైన రోల్ ప్లే చేయడమే కాదు నాటికి నేటికి ఏ నాటికి చిరస్థాయిగా వుంటుంది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా.. అన్నిటినీ మించి జయ జయహే తెలంగాణా పాట తో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి అమలు చేస్తున్నది.’ అంటూ ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.
అందెశ్రీ తన పాటల ద్వారా ప్రజల్లో అపారమైన చైతన్యం నింపారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే ఆయన గీతం ఎంతగానో ప్రజాదరణ పొంది, ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల సిలబస్‌లో కూడా చేర్చబడింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన పాత్ర అద్వితీయం. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత, ఈ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్రగీతంగా గుర్తించింది.
పురస్కారాలు
సాహిత్యం సినిమా రంగాలలో ఆయన చేసిన కృషికి గానూ అనేక గౌరవాలు, పురస్కారాలు లభించాయి. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో ‘గంగ’ సినిమాకు గానూ ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం పొందారు. దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. అందెశ్రీ కేవలం కవి మాత్రమే కాదు, తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన పాటలు, కవిత్వం చిరకాలం ప్రజల హృదయాల్లో జీవించి ఉంటాయి. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి తీరని లోటు.
