Telangana BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా కాషాయ పార్టీ ఓటర్లను భారీ స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు రప్పించగలిగినట్లయితే గెలుపు తథ్యమనే ధీమాతో ఉన్నది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలో కేవలం 43.28 శాతమే పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ పెరిగినట్లయితే తమకు ఓటు బ్యాంకు మరింత పెరుగుతుందనే ఆశతో కమలదళం ఉన్నది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న వారిలో రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను మినహాయిస్తే ఇతర కేంద్ర మంత్రులెవరూ ప్రచారానికి రాలేదు. అయినా గెలుపు ధీమాతో బీజేపీ ఉండడం గమనార్హం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఈ సెగ్మెంట్ నుంచి గతంలో అవకాశం కల్పించారని ఈసారి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రచారంలో కమలం పార్టీ నేతలు ఓటర్లను కోరారు.
ఓటర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. బీజేపీ(BJP) దీన్ని 78 శక్తి కేంద్రాలుగా విభజించుకుని పని చేసింది. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసింది. దీనికి తోడు కార్పెట్ బాంబింగ్ పేరిట ఒకేసారి 50కి పైగా స్థానాల్లో పాదయాత్రలు చేపట్టింది. ఈ అంశాలు తమకు కలిసొస్తాయనే భావనతో ఉన్నది. దీనికి తోడు కాషాయ పార్టీకి నవంబర్ నెల సెంటిమెంట్‌గా మారింది. గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. అదే నెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఈసారి కూడా గెలుపు తమదేనని ధీమాగా ఉన్నది. జూబ్లీహిల్స్‌లో 7 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ముస్లింల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారుతాయనే ప్రచారం ఉన్నది. అయితే ఈ ఎన్నికలో ఇవేవి వర్కువుట్ అయ్యే ఛాన్స్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Also Read: Tummala Nageswara Rao: పత్తి నిబంధనను తొలగించని కేంద్రం.. తెలంగాణకు కేంద్రం నో రెస్పాన్స్..!
పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి గెలుపు పోలింగ్ శాతంపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటారనే ప్రచారం జరుగుతుండగా చివరి అంకంలో కమలదళం హిందు, ముస్లింల మధ్య జరిగే ఫైట్‌గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మొలతాడు ఉన్నవారికి, లేని వారికి మధ్య జరుగుతున్న యుద్ధంగా కేంద్రమంత్రి బండి చేసిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో హిందువులు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తే చాలని, ఆటోమేటిక్‌గా గెలుపు తీరాలకు చేరినట్లేననే ధీమాతో కమలనాథులు ఉన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో మొత్తం 4,01,365 ఓటర్లున్నారు. అందులో ముస్లిం ఓటర్లు దాదాపు 1.18 లక్షలకు పైచిలుకు ఉంటాయి. అవి కాకుండా మిగతా ఓట్లన్నీ హిందువులవే కాబట్టి అవన్నీ తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని పార్టీ లెక్క లేసుకుంటున్నది. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ కాబోమని, కింగ్‌గా నిలుస్తామని ధీమాతో కమలదళం ఉన్నది. ఇతర పార్టీలతో పోలిస్తే ప్రచారంలో కాస్త వెనుకబడిన బీజేపీ పోల్ మేనేజ్‌మెంట్ ద్వారా అయినా సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నది.
Also Read; Kidney Health: కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ ను మానేయండి!
