– కరీంనగర్‌లో నీట్ మంటలు
– కేంద్రమంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడి
– విద్యార్థి సంఘాల నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు
– పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం
– కాసేపు టెన్షన్ వాతావరణం
Bandi Sanjay: నీట్ వ్యవహారం కేంద్రమంత్రులు, ఎంపీలకు తలనొప్పిగా మారింది. విద్యార్థి సంఘాలు వారి ఇళ్లను ముట్టడిస్తున్నాయి. ఆదివారం హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం స్పందించాలని, 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందంటూ, కరీంనగర్‌లోని జ్యోతి నగర్‌లో గల సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారులు. కోర్టు చౌరస్తా నుండి మంత్రి కార్యాలయం వరకు దూసుకొచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవాడంతో వాగ్వాదం జరిగింది. కార్యాలయం వైపు బారిగేట్లు నెట్టుకొని వెళ్లేందుకు యత్నించిన నాయకులను అరెస్టు చేసి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఆ సమయంలో కాసేపు హైటెన్షన్ నెలకొంది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి మాట్లాడుతూ, నీట్ పరీక్షలో మొత్తం 23 లక్షల 33 వేల 297 మంది, యుజీసీ-ఎన్ఏటీ పరీక్షలో మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, యుజీసీ-ఎన్ఏటీ రద్దు చేయడం వెనుక నీట్ అవకతవకలను మరిపించడం కోసమేననే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నీట్, యుజీసీ-ఎన్ఏటీ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, పరీక్ష కుంభకోణానికి బాధ్యత వహిస్తూ వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని, కేంద్ర పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల సమస్యలపై స్పందించి, వారికి న్యాయం జరిగేలా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేష్, అరవింద్, ఎన్ఎస్‌యూఐ నాయకులు అనిల్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.