– నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
– ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు
– పలువురు కేంద్రమంత్రులతో భేటీలు
– రాష్ట్ర అభివృద్ధి పనులపై చర్చలు
– హైకమాండ్‌తోనూ సమావేశానికి ఛాన్స్
– కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ
Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇవాళ ఉదయం హస్తిన ఫ్లైట్ ఎక్కనున్నారు. ఈ టూర్‌లో భాగంగా రాష్ట్రంలో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్రమంత్రులతో భేటీలు, నిధుల కోసం వినతులు చేయనున్నారు సీఎం. అలాగే, హైకమాండ్‌తో భేటీతో చేరికలు, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇలా అన్నీ ఓ కొలిక్కి వస్తాయని అంటున్నారు.
ఎంపీల ప్రమాణానికి హాజరు
ఈమధ్యే పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసింది. కేంద్రంలో మరోమారు మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికైన ఎంపీలు రెండు రోజులపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు పాల్గొననున్నారు.
హైకమాండ్‌తో చర్చలు, మంత్రి వర్గ విస్తరణ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకో ఆరు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం చాలామంది నేతలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ ఢిల్లీ టూర్‌తో కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడంతో నేతల లెక్కలు తారుమారవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నామినేటెడ్ పోస్టులపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్
పార్లమెంట్ ఎన్నికల ముందు కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు సీఎం రేవంత్. అయితే, ఇప్పటిదాకా ఏ ఒక్కరూ బాధ్యతలు స్వీకరించింది లేదు. ఆ స్థానాల్లోనూ మార్పులు ఉంటాయనే ప్రచారం ఉంది. చేరికలు మళ్లీ జోరందుకున్న నేపథ్యంలో భారీ స్థాయిలో మార్పులు, చేర్పులు ఉంటాయని అనుకుంటున్నారు. దీనిపైనే సీఎం రేవంత్, హైకమాండ్‌తో చర్చించనున్నట్టు సమాచారం.