Telangana Winter Season: ఈ ఏడాది వర్షాకాలం కాస్త ఆలస్యంగా ముగిసిపోగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్టుగా శీతకాలం వెనువెంటనే ఊపందుకుంది. వానలు తగ్గిపోయిన రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తలు గణనీయంగా (Telangana Winter Season) తగ్గాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 14.7 సెంటీగ్రేడ్, రంగారెడ్డిలోని షాబాద్‌లో 14.7 డిగ్రీలు, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8 డిగ్రీలు, శంకర్‌పల్లిలో 14.9 డిగ్రీలు, మొయినాబాద్‌లో 15 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని భీంపూర్‌లో 15 డిగ్రీలు, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక, రాజధాని హైదరాబాద్ నగరం, శివార్లలోనూ స్వల్ప స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రాజేంద్రనగర్‌లో 15.3 సెంటీగ్రేడ్, యూవోహెచ్‌లో 15.3, భెల్‌లో 15.5, మల్కాజ్‌గిరిలో 15.7, కుత్బుల్లాపూర్‌లో 15.7, గచ్చిబౌలిలో 15.9, మారేడ్‌పల్లిలో 16, ఆర్సీ పురంలో 16.1, బేగంపేట్‌లో 16.4, నేరేడ్‌మెట్‌లో 17.1, అల్వాల్‌లో 17.1, కార్వాన్‌లో 17.5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున స్వల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ‘తెలంగాణ వెధన్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) వెల్లడించింది.
ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చలిగాలుల ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు శివార్లలో రాత్రివేళలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికే, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి పడిపోయాయి. ఇక, రాబోయే రోజుల్లోనూ చలి మరింత ఉండనున్నట్టు అంచనాలు నెలకొన్నాయి. తెల్లవారుజామున నగర శివార్లు, పచ్చటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 16-17 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పడిపోయే అవకాశం ఉందని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ అంచనాగా ఉంది. శనివారం నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉండనున్నట్టు పేర్కొంది. దీనినిబట్టి హైదరాబాద్ నగరంలో శీతాకాలం అధికారికంగా వచ్చేసినట్టేనని చెప్పవచ్చు.
ఈ ఏడాది చలిపులి పంజా!
ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘లానినా’ అనే వాతావరణ దృగ్విషయమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది చలికాలం తీవ్రంగా ఉంటుందనే అంచనాకు ప్రధాన కారణం లానినా (La Niña) అనే వాతావరణ దృగ్విషయం. లానినా ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు ఉష్ణమండల ప్రాంతాలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా ఉంటాయి. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుంది. అలాగే, ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంది. మంచు కూడా ఎక్కవగా పడుతుంది. ఉత్తరం వైపు నుంచి దక్షిణ దిశగా శీతలు గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read Also- Chikiri song record: బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్.. ఇండియాలో ఇదే ఫస్ట్ సాంగ్
లానినా ప్రభావంతో పాటు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా చలి తీవ్రతను పెంచేందుకు దోహదపడవచ్చని విశ్లేషిస్తున్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిపోయి, ఆకాశం నిర్మలంగా మారిపోవడంతో పొడి వాతావరణం ఏర్పడిందని సూచిస్తున్నారు. దీంతో, పగటిపూట ఉష్ణోగ్రతలు త్వరగా తగ్గి, రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని అంటున్నారు. మేఘావృతాలు లేనప్పుడు భూమి తన వేడిని త్వరగా కోల్పోతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, ఉత్తర భారత దేశం నుంచి తెలంగాణ వైపునకు వీచే పొడి, చల్లని వాయవ్య దిశ గాలులు ఉష్ణోగ్రతలను మరింతగా తగ్గిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది తెలంగాణలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్ వంటి ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో ఈ పరిస్థితులు ఉంటాయంటున్నారు.
#Hyderabad Outdoor temperatures are dipping as DRY COLD WINDS sweep in from the North!
At 10PM, outskirts are already touching 20°C, while core city areas remain around 22–23°C.
By early morning, outskirts & greener zones could drop to 16–17°C 🌡️Get ready for a further… pic.twitter.com/b1WrxER48p
— Hyderabad Rains (@Hyderabadrains) November 7, 2025
