– రైతు భరోసా ఆపొద్దు
– సబ్ కమిటీలంటూ కాలయాపన చేయొద్దు
– లీకేజీలు తప్ప సరైన పాలన ఏది?
– పవర్ కమిషన్ నుంచి నోటీసులు అందాయి
– వారం లోగా సమాధానం చెప్తానన్న జగదీశ్ రెడ్డి
Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు పంపింది. వారం రోజుల గడువులో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తనకు నోటీసులు అందాయని, తప్పకుండా వారం వ్యవధిలో తన లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపి సమాధానం ఇస్తానని బీఆర్ఎస్ లీడర్, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పానని, అవసరమైతే న్యాయ విచారణ చేయాలని అదే అసెంబ్లీ సాక్షిగా అడిగానని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అనుమానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిందని వివరించారు. అయితే, ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ.. అందుకే జస్టిస్ నర్సింహారెడ్డికి కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. తాను న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులకు సమాధానం ఇస్తానని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలపడుతున్నదని, అందుకే వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అందుకే పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ప్రమాణం చేశారని ఎద్దేవా చేశారు. రుణమాఫీతోపాటు రైతు బంధు కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై మాట తప్పిందని, రైతు భరోసా కొంతమంది రైతులకు వేశారని, ఇప్పుడు మాత్రం కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయాలు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. ఇలా కమిటీల డ్రామాలతో కాలయాపన చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో పనికిమాలిన లీకేజీలు తప్పా.. పాలన చేసింది లేదని, కొత్తగా పనులు మొదలుపెట్టినవీ లేవని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదని ఆరోపిస్తూ రాష్ట్రంలో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున నడుస్తున్నదని చెప్పారు. అందుకే లీకేజీలు పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, అందరూ చూస్తుండగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని, నగరంలో మహిళలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు.