– రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు
– మియాపూర్ ఘటనపై కేటీఆర్ ట్వీట్
Miyapur: రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తమ పాలనలో శాంతి భద్రతలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నదని, కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జత చేశారు. మియాపూర్‌లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఆక్రమించుకోవాలనుకున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. గుడిసెలు వేసుకోవడానికి సుమారు రెండు వేల మంది వరకు వచ్చినట్టు తెలిసింది. వారు పోలీసులపై ఎదురుతిరిగారు. రాళ్ల దాడి చేయడంతో పోలీసులు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం
గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్ అసమర్థ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.
హైదరాబాద్ లోని మియాపూర్‌లో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. pic.twitter.com/iDaWFCJXGe
— BRS Party (@BRSparty) June 23, 2024
ప్రస్తుతం మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతీ ఉత్తర్వులు జారీ చేశారు. 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.