– ప్రధాని సహా పలువురు ఎంపీల ప్రమాణ స్వీకారం
– 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక
– 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
– ఎంపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి
Oath Taking: ఏప్రిల్, జూన్ నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలిసారి రేపు లోక్ సభ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర ఎంపీలు ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత 26వ తేదీన లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
18వ లోక్ సభ తొలిసారి సోమవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటల నుంచి ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత అల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అంటే అసోం నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు తొలిగా ప్రమాణం తీసుకుంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన ఎంపీలు చివరగా తీసుకుంటారు. ఇందులో సోమవారం ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా 280 మంది ఎంపీలు ప్రమాణం తీసుకోగా.. 264 మంది ఎంపీలు తదుపరి రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వీరితో ప్రమాణం చేయిస్తారు. అంతకంటే ముందు రాష్ట్రపతి భవన్‌లో లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా మహతబ్‌తో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయిస్తారు.
26వ తేదీన లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పాత్ర కీలకంగా ఉండనుంది. స్పీకర్ పదవి కోసం బీజేపీ మిత్రపక్షాలు పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యాక ప్రధాని మోదీ.. తన మంత్రిమండలి సభ్యులను సభకు పరిచయం చేస్తారు.
27వ తేదీన రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలవుతుంది. ఈ తీర్మానంపై ప్రధాని మోదీ జులై 2వ లేదా 3వ తేదీల్లో మాట్లాడే అవకాశం ఉన్నది. కాగా, ఈ ఏడాది సంపూర్ణ బడ్జెట్‌ను వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. జులై 22వ తేదీ నుంచి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే చాన్స్ ఉన్నది.
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లతో మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ సొంతంగా 240 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇండియా కూటమి 243 స్థానాలను గెలుచుకోగా అందులో కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272.
ఢిల్లీకి సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రులకు వినతి పత్రాలను ఇవ్వనున్నారు.