Gold Shop Scams: కొత్తది చొక్కం… పాతది మకిలి
బంగారం నాణ్యత పరిశీలనలో మోసాలు
ప్రమాణాలు పాటించని వైనం
వినియోగదారులకు శఠగోపం
అనుమతులు లేని యంత్రాలతో నగదు దోపిడీ
బంగారం షాపులను పట్టించుకోని అధికారులు
నగరంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎంతో కష్టపడి కూడబెట్టిన నగదుతో పిల్లల కోసం బంగారం కొనుక్కోవాలని అనుకుంటారు. అదే బంగారం అత్యవసర పరిస్థితులను బట్టి అమ్ముదామంటే కోతలు పెట్టి, కొన్న విలువ కంటే భారీగా తగ్గిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కొనేదంతా బంగారమే… కానీ అమ్ముదామంటే బంగారంలో కల్తీ ఉందని చెబుతారు. మధ్యతరగతి ప్రజలు లక్ష్మిదేవిగా భావించే బంగారంలో కల్తీ పేరుతో షాపులు దోచుకుంటున్నాయి. కొనేటప్పుడు తరుగు, నగ తయారీ ఖర్చు ఉండదని, ఈ నగ మార్చుకుంటే యథావిథిగానే తూకం వేస్తామని మాటాలు చెబుతుంటారు. కానీ కొనేంత వరకు ఓ మాట, మార్పు చేసుకునేటప్పుడు మరో మాట చెప్పి వినియోగదారులను నిండా ముంచుతున్న వైనం (Gold Shop Scams) కనిపిస్తోంది.
కల్తీ పేరుతో తరుగు అధికం
బంగారం ధర రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. సామాన్యుడి గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఈ సందర్భంలో నగల వ్యాపారుల మోసాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. మార్కెట్లో ధరలకు, హాల్ మార్క్ నిబంధనలకు విరుద్దంగా వ్యాపారాలు చేస్తున్నారు. 24 క్యారెట్ల నగను తీసుకునేటప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జీ, జీఎస్టీలు అని వేస్తారు. అదే నగను మార్చుకునేందుకు బంగారం వ్యాపారి వద్దకు వెళ్తే మరోసారి మేకింగ్, తరుగు జీఎస్టీల పేరుతో భారీ మేసాలకు పాల్పడుతున్నారు. అంటే, బంగారం కొన్నా, తిరిగి అమ్ముకున్నా వ్యాపారి లబ్ధి కోసమే షాపుల్లో ధరలు నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. పాత బంగారం కొనుగోళ్లు చేస్తే 5 శాతం నుంచి 10 శాతం మేరకు తరుగు తీస్తూ భారీ మోసాలు చేస్తున్నారు. ఈ విధానాలకు అడ్డుకట్టే వేసే అధికారులు లేకపోవడం విచారకరం.
నగరంలోని బంగారం షాపులపై నిఘా ఏదీ?
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వాడ ఒకటి బంగారం షాపులు దర్శనమిస్తున్నాయి. నమ్మకంగా బంగారం ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుల పొట్టను కొట్టే పరిస్థితి ఉంది. బంగారం షాపు యాజమానులు చెప్పే మాటలకు ఆకర్షితులై వినియోగదారులు మోసపోతున్నారు. అదే స్వర్ణకారులు చేసే నగలకు వంకలు పెడుతూ, తరుగు విషయంలో వాదించే వినియోగదారులు బంగారం షాపుల్లో మాట కూడా మాట్లాడకుండా అడిగినంత చెల్లిస్తారు. దీంతో ఆ షాపుల యాజమానులకు ఆసరాగా మారి భారీస్థాయిలో దందాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దందాలపై సంబంధిత శాఖాధికారులు నిఘా పెట్టడంలో విఫలమైయ్యారని స్పష్టంగా కనిపిస్తోంది.
నిర్లక్ష్యంలో అధికారులు!
బంగారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదులు లేకపోవడంతోనే సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. బంగారంపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన బీఐఎస్ వినియోగదారులకు విరుద్దంగా పనిచేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహారిస్తున్నారు. బులియన్ మార్కెట్లో అనేక రకాలుగా భారీ మోసాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఆ నగల వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై తమకు పట్టనట్టు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సంబధిత అధికారులు బంగారు షాపులపై తనిఖీలు చేయలేదు. అంతేకాకుండా ఒక్క కేసు కూడా నమోదైనట్లు రికార్డుల్లో లేదని ప్రచారం సాగుతుంది. అనుమతులు లేని షాపులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
Read Also- Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది
మోసం ఇలా….
నగ నచ్చకనో, ఆభరణం పాతబడడమో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడమో జరుగుతుంది. దీంతో తమ ఆభరణాన్ని తిరిగి ఇచ్చి మరో నగ తీసుకోవాలని షాపు దగ్గరికి వస్తారు. 22 క్యారెట్ల నగను తీసుకున్న షాపులోనే తిరిగి ఇచ్చేటప్పుడు తరుగు తీస్తామని చేబుతారు. అయితే కాలనీలల్లో పెట్టుకునే బంగారం షాపుల వద్దకు సామాన్యులు వస్తారు. ఆషాపుల దారుణం వర్ణించడం కష్టం. ఎల్బీనగర్ సర్కిల్ వనస్థలిపురంలో శాంతినగర్ కాలనీలోని శ్రీబాలజీ జ్యూలెరి దందా అంతా ఇంతా కాదు. ఇదే షాపుల్లో ఏడాది కింది ముక్కుపుడుకను 208 మిల్లిగ్రాముల బంగారాన్ని రూ.2400లకు తీసుకోవడం జరిగింది. అదే షాపులో ముక్కుపుడకను తిరిగి ఇచ్చేందుకు వెళ్లిన 208 మిల్లి గ్రాముల బంగారానికి రూ.1200 ఇస్తామని చెప్పడంతో వినియోగదారుడు అవాక్కయ్యారు. ఎందుకంటే ధర పెరిగినప్పటికి కొన్న ధరలో సగమే ఇవ్వడంపై అనుమానాలు వచ్చాయి. అయితే పాత నగ కావడంతో 208 మిల్లి గ్రాముల బంగారంలో 20 మిల్లిగ్రామాలు రాళ్లుగా గుర్తించి మిగిలిన బంగారంలో 60శాతం తరుగు తియడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
