ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ టీచర్ వ్యవహారంపై మొదలైన విచారణ
శ్రీనివాస్ రెడ్డి వివరాలు ఆరా తీస్తున్న విజిలెన్స్ అధికారులు
త్వరలో టెర్మినేషన్ లేదా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం!
Swetcha Effect: ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2023 నుంచి ఎంచక్కా జీతం తీసుకుంటూ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న టీచర్ శ్రీనివాస్ రెడ్డిపై విద్యాశాఖ విచారణ షురూ అయింది. ఇంగ్లీష్ టీచర్‌గా విధులు చేపట్టాల్సిన శ్రీనివాస్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరించడంపై ఆర్టీఐ కార్యకర్త గోపాల్ ఫిర్యాదు చేయగా, హ్యూమన్ రైట్స్ కోర్టు సీరియస్‌గా తీసుకొని నోటీసులు జారీ చేయడంపై ‘స్వేచ్ఛ’ పత్రిక (Swetcha Effect) ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అనంతరం విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ మొదలు పెట్టారు.
Read Also- Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
దర్పల్లి మండలం మైలారం గ్రామంలో విధులకు హాజరుకాకుండా ఎంఎల్ఏకు పీఏగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై విద్యాశాఖ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. జెడ్‌పీహెచ్ఎస్ హైస్కూల్‌కి విజిలెన్స్ అధికారులు వెళ్లారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, శ్రీనివాస్ రెడ్డి ఇంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశారనే దానిపై ఆరా తీశారు. ఎంతమంది ప్రజాప్రతినిధుల వద్ద పీఏగా పనిచేశాడనే విషయాలను తెలుసుకుంటున్నారు. టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి, అటెండెన్స్ వేసుకుంటూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాడు. దీంతో, ఎన్ని నెలల జీతం తీసుకున్నాడు?, లీవ్‌పై పెట్టిన ప్రొసీడింగ్స్, డీఈవోకి తెలిసే ఇదంతా జరిగిందా?, ఇలా పలు కోణాల్లో అధికారులు విచారణ జరిపారు. ఆర్టీఐ కార్యకర్త గోపాల్ 8 నెలల క్రితమే ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు విచారణ చేయలేదు?, ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించేదాక ఎందుకు నిర్లక్ష్యం వహించారు?, ఇలా చాలా అంశాలపై విచారణ జరిగినట్టు సమాచారం.
ఇప్పటికే టీచర్‌కు, డీఈవోకు నోటీసులు
ఈ వ్యవహారంపై నిందిత టీచర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈవో అశోక్‌కు హ్యూమన్ రైట్స్ కోర్టు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. చాలా కాలంపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి, ఎమ్మెలే పీఏగా పనిచేస్తుండాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలని ఆదేశించింది. విద్యా హక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ ఆర్టీఐ కార్యకర్త గోపాల్ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చింది. దీనిపై డీఈవో అశోక్‌ను ‘స్వేచ్ఛ’ ప్రతినిధి సంప్రదించగా, శ్రీనివాస్ రెడ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు పీఏలుగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
