Duvvada Couple: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. అయితే కాశీబుగ్గ బాధితులను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట పరామర్శించారు. వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నగదు సాయాన్ని సైతం అందించారు.
రూ. 50,000 సాయం
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన పలువురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట.. మేమున్నామంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చారు. గాయపడ్డవారికి రూ.10,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే నందిగామ మండలం శివరామపురం గ్రామానికి చెందిన చిన్ని యశోద కుటుంబానికి రూ.50,000 అందజేశారు.
View this post on Instagram
కాశీబుగ్గ ఆలయం పరిశీలన
తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని సైతం దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) జంట పరిశీలించారు. ఆలయ ధర్మకర్త హరిముకుంద, ఆయన కుమారుడ్ని స్వయంగా కలుసుకొని ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితుల గురించి.. వారు దువ్వాడకు వివరించారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులను సైతం దువ్వాడ జంట పరిశీలించింది.
View this post on Instagram
గుడిని మళ్లీ తెరుస్తా: ఆలయ ధర్మకర్త
తొక్కిసలాటకు కారణమైన ఆలయాన్ని.. అనుమతులు లేని కారణంగా కూటమి ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. ఈ నేపథ్యంలో ఆలయ ధర్మకర్త హరిముకుంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాన్ని తాను తిరిగి తెరుస్తానని చెప్పారు. దేవుడికి గుడి కట్టానని.. అందరూ వచ్చి పూజలు చేయాలని కోరుకున్నానని హరిముకుంద అన్నారు. కానీ ఇలా తొక్కిసలాట జరిగినందుకు తానేమి చేస్తానని పేర్కొన్నారు. తనపై కావాలంటే కేసులు పెట్టుకోండని ఆయన చెప్పినట్లు కథనాలు వచ్చాయి.
Also Read: India vs Australia: నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోర్.. గెలుస్తారో, లేదో?
తొక్కిసలాటకు కారణమిదే..
కార్తికమాసంలో వచ్చిన ఏకాదశి కావడంతో నవంబర్ 1న పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు కాగా.. ఏకాదశి కావడంతో ఏకంగా 25వేల మంది వరకూ భక్తులు వచ్చారు. అయితే ఎంట్రీ, ఎగ్జీట్ ఒకటే కావడంతో భక్తుల తాకిడి పెరిగి.. రెయిలింగ్ పై ఒత్తిడి పడింది. దీంతో మెట్ల మీద నుంచి పదుల సంఖ్యలో భక్తులు కిందపడిపోయారు. ఒకరిమీద ఒకరు పడిపోవడంతో ఊపిరాడక 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది.
