Swetcha Effect: రవాణా శాఖ అధికారుల తీరుపై ‘స్వేచ్ఛ’ రాస్తున్న కథనాలకు స్పందించారు. ఈ నెల 4న ఓవర్ లోడ్ నియంత్రణ బాధ్యత ఎవరిది?.. అనే కథనాన్ని ప్రచురించింది. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనతో తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సిబ్బందికి సైతం డ్యూటీలు సరిగ్గా చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. కమర్షియల్ వాహనాలు పరిమితికి మించి రవాణా చేయవద్దనే నిబంధనలు ఉన్నా.. ఆ వాహనాలను నిత్యం మానిటరింగ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు ప్రతి రోజూ తనిఖీలు చేయడం లేదని తేలింది. కానీ వారి ఉదాసీనత కారణంగానే కమర్షియల్(Commercial), మైన్స్ మినరల్స్(Mines Minerals) తరలించే వాహనాలు నిబంధనలు పాటించడం లేదని బయటపడింది.
జీరో బిల్లులతో ఓవర్ లోడ్..
దీంతో తనిఖీ చేయాల్సిన అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితేనే స్పందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు మైనింగ్ వ్యాపారులు(క్రషర్ మిషన్ వ్యాపారులు) నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వే బిల్లులు లేకుండా అంటే మైనింగ్ రాయల్టీ చెల్లించకుండా జీరో బిల్లులతో ఓవర్ లోడ్ వేస్తున్నాయని, టిప్పర్లు, లారీలు ఓవర్ లోడ్(Over Load), ఓవర్ స్పీడ్(Over Speed) కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులే పేర్కొంటున్నారు. వాటిపై చర్యలు తీసుకోకుండా కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ‘స్వేచ్ఛ’ కథనం ప్రచురించడంతో రవాణాశాఖ అధికారులు స్పందించారు.
తనిఖీల్లో భాగంగా..
బుధవారం రంగంలోకి దిగి ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను పట్టుకున్నారు. గ్రేటర్‌లో మూడు టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు జేటీసీ రమేశ్(JTC Ramesh) తెలిపారు. ఇసుక(Sand), బ్రిక్స్(Brics), మెటల్(Metal) తరలిస్తున్న టిప్పర్లు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తరలిస్తుండగా తనిఖీల్లో భాగంగా నాగోల్‌లో ట్రాన్స్‌పోర్టు అధికారులు పట్టుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
