Gaddam Prasad Kumar: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కేసులో మరో అడుగు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అందులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అక్టోబర్‌లో పూర్తి చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలపై విచారణకు సంబంధించి స్పీకర్ షెడ్యూల్ ప్రకటించారు. 6వ తేదీన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లను విచారణ జరుగనున్నది.
Also Read: Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై విచారణ
7న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై విచారణ జరుపనున్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 12న పిటిషనర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, జగదీశ్‌రెడ్డిని, 13న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విచారణ జరుగుతుందని స్పీకర్ షెడ్యూలు జారీ చేశారు. అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్) విచారణ అంశం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంలో మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విధించిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. కేవలం నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తికావడంతో స్పీకర్ గడువు పొడగించాలని సుప్రీంకోర్టును మళ్లీ ఆశ్రయించారు. గడువు ఇవ్వడంతోనే ఎమ్మెల్యే విచారణ చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ తర్వాత స్పీకర్ సుప్రీం కోర్టుకు నివేదిక ఏం ఇస్తారు.. ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
Also Read: Gaddam Prasad Kumar: నీటి సరఫరా మెరుగుపరచండి.. మిషన్ భగీరథ పై స్పీకర్ ఆదేశాలు!
