– రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ
– తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి హాజరు
– రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సూచనలు
Nirmala Sitharaman: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వచ్చే నెల జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కాగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి చర్చించారు. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనల కోసం ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించారు.
ఈ రెండు సమావేశాల్లో పాల్గొన్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సలహాలు, సూచనలను కేంద్రానికి స్పష్టంగా చెప్పినట్టు వివరించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా దేశానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలూ ఉన్నాయని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌తో ఏడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డులు తిరగరాయబోతున్నారు. ఇది వరకు ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జి దేశాయ్ పేరు మీద ఉన్నది. ఏడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రికార్డును నిర్మల బ్రేక్ చేయనున్నారు.