CM Revanth Reddy: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లు, వారి సమస్యలపై క్యాబినెట్‌లో చర్చిస్తారని, నిర్ణయాలు తీసుకుంటారని అనుకన్నామని, కానీ, అందరి ఆశలు అడియాసలు చేశారని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని, నిరుద్యోగులకు రూ. 4000 భృతి ఇస్తారని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఆరు నెలలు దాటినా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
గ్రూప్స్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని చెబుతూ.. మెయిన్స్‌కు 1:50 నిష్ఫత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని హరీశ్ రావు కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే నిష్పత్తితో మెయిన్స్‌కు ఎంపిక చేశారని, మొన్న ఏపీలో కూడా ఇలాగే ఎంపిక చేశారని వివరించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు 1:100నే డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అలాగే గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు.
గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై @TelanganaCMO గారికి బహిరంగ లేఖ. pic.twitter.com/yGCQwbJKnE
— Harish Rao Thanneeru (@BRSHarish) June 22, 2024
పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి(ఏడు రోజులు) తక్కువ ఉన్నదని వివరిస్తూ డీఎస్సీ పరీక్షలకు, గ్రూప్ 2 పరీక్షలకు మధ్య వ్యవధిని పెంచాలని హరీశ్ రావు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి క్యాలెండర్ ప్రకటించి, అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
తొలి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారని, 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తారని హఆమీ ఇచ్చారని, కానీ, ఆచరణలో మాత్రం 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. అదే విధంగా రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని చెప్పి దాని ప్రకారమే పూర్తి చేశారని, ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.