Duddilla Sridhar Babu: ద్వైపాక్షిక సహకారంతో నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని, ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ – క్యూబా సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్ తో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్, కల్చర్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై చర్చించారు.
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ ద్వారా క్యూబా స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా తదితర అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. తెలంగాణతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా పేర్కొన్నారు.
