ktr revanth reddy
Politics

CM Revanth Reddy: కోల్ వార్ @ ట్విట్టర్

– రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
– ట్విట్టర్‌లో గనుల వేలంపై మాటల యుద్ధం
– వేలం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొనడంపై కేటీఆర్ అభ్యంతరం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
– మొదటి వేలంలో గనుల్ని ప్రైవేట్‌పరం చేసిందెవరు అంటూ ఫైర్
– అబద్ధాలు చెబుతున్నారంటూ కేటీఆర్ మరో ట్వీట్
– నేతల ట్వీట్ వార్‌తో ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం

Singareni: బొగ్గు గనుల వేలంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నది. కేంద్రం గనులను వేలం వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ, సింగరేణి కోసం కోల్ బ్లాక్స్ వేలం వేయకుండా కేటాయించాలని కోరింది. కాగా, తమ హయాంలో సింగరేణికి నష్టం జరగకుండా చూశామని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బొగ్గు వేలానికి సిద్ధపడ్డాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది.

ముందుగా, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బొగ్గు వేలాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖను కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘రేవంత్ గారు.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేశారు. నాలుగు బొగ్గు గనులను సింగరేణి కాలరీస్‌కు అప్పజెప్పాలన్నారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు మీ డిప్యూటీ సీఎంను వేలాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో పాల్గొనడానికి పంపించారు. వాస్తవానికి దీన్నే కాంగ్రెస్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? ఈ అంశంపై మీ ప్రభుత్వం కేంద్రాన్ని నేరుగా ఎందుకు ప్రశ్నించడం లేదు?’ అంటూ ఫైరయ్యారు కేటీఆర్.

ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘కేటీఆర్ గారు.. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు చెప్పే విషయాలను ఆలకించని మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం లేదు. కానీ, మేం మళ్లీ మళ్లీ చెప్పి మీరు వినేలా చేయాలని ఆశపడుతున్నాం. మన ప్రజల సంపదైన సింగరేణి ప్రైవేటీకరణ లేదా వాటాల అమ్మకాలను తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అది కేంద్రం చేసినా, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసినా వ్యతిరేకించింది. సింగరేణి బొగ్గు గనుల వేలం తొలిసారిగా కేంద్రం నిర్వహించినప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. ఈ వేలాల్లో అరబిందో, అవంతిక కంపెనీలకు సింగరేణి గనులను అమ్మేశారు. కానీ, మీరు లేదా మీ పార్టీ ఎప్పుడూ ఇందుకు వ్యతిరేకంగా గళమెత్తలేదు. ఎందుకు? ప్రైవేటీకరణను, సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిరసించడమే కాదు, అవంతిక, అరబిందో(మీ శ్రేయోభిలాషి)లకు అమ్మిన గనులను తిరిగి సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేయడానికి మా డిప్యూటీ సీఎం ఆ కార్యక్రమానికి వెళ్లారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, సంపద, హక్కుల భవిష్యత్ కాంగ్రెస్ చేతిలో సురక్షితంగా ఉన్నాయి. మేం కేవలం బొగ్గు కోసమే కాదు ప్రతి పౌరుడి హక్కుల కోసం పోరాడుతున్నాం. సింగరేణి, ఔటర్ రింగ్ రోడ్డులను అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం వింత’ అని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, మరోసారి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారని, ఇది చూసి గోబెల్స్ కూడా సమాధి నుంచి తలదించుకుంటున్నారని సెటైర్ వేశారు. 60 ఏళ్లపాటు తెలంగాణకు గోసపెట్టి, వేలమందిని క్రూరంగా చంపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, వనరులను దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో తెలంగాణ గనులను రెండు కంపెనీలకు బీజేపీ కేటాయించినా, బీఆర్ఎస్ వ్యతిరేకించిందని, అందుకే అక్కడ మైనింగ్ ప్రారంభం కాలేదని వివరించారు. రేవంత్ రెడ్డి పేర్కొన్న రెండు కంపెనీలు గతంలో కాంగ్రెస్, శివసేన ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో గనులు దక్కించుకున్నాయని పేర్కొన్నారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ