– తుపానులో చిక్కుకున్న పడవలా బీఆర్ఎస్
– అటు ఫిరాయింపులు.. ఇటు కేసులు
– ఊపందుకున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్
– ఇంకా సైలెంట్ మోడ్‌లోనే గులాబీ బాస్
– కేసీఆర్ మౌనం దేనికి సంకేతం?
– ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు వెళతారా?
– అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం ఏది?
After parliament elections kcr silent not interact with cadre: పది సీట్లు ఇవ్వండి కేంద్రంలో చక్రం తిప్పేస్తా.. సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేస్తాం.. కాంగ్రెస్ లీడర్లు మాతో టచ్‌లో ఉన్నారు.. చేతకాని సీఎం, దద్దమ్మ మంత్రులు ఇలాంటి డైలాగులు అన్నీ ఇప్పుడు మూగబోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇంకా తమ హవా ఎంత మాత్రం తగ్గలేదన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ ఇష్టారీతిలో మాట్లాడారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా ఇద్దరూ సైలెంట్ అయ్యారు. సొంత పార్టీ నేతలతో సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించడం లేదు. కేటీఆర్ కనీసం ట్విట్టర్‌లో అన్నా స్పందిస్తున్నారు. కానీ, కేసీఆర్ జాడ మాత్రం లేదు.
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్
కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డిని లాగేసుకుంది. ఇంకా బడా నేతలు క్యూ కడతారని అంటున్నారు. త్వరలోనే మరికొందరు నేతలు కండువాలు మార్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలోనూ గులాబీ బాస్ మౌనంగా ఉండిపోవడం అటు పార్టీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, నెల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పరాభవం తర్వాత తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను ఏలిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మౌనమునిగా మారిపోయారని సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు.
ఎందుకీ సైలెన్స్?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్ సభ ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్, ఫలితాల తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆఖరికి జైల్లో ఉన్న కన్న కూతురు కవితను కూడా పరామర్శించేందుకు వెళ్ల లేదు. అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తా, పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చేస్తా, తెలంగాణలో బీఆర్‌ఎస్ తప్ప మరే పార్టీనైనా తొక్కేస్తా అంటూ బీరాలు పలికిన కేసీఆర్, అధికారం కోల్పోయాక తన కూతురు కవితను జైలు నుంచి విడిపించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో తన గెలుపుతోపాటుగా ఏపీలో తన మిత్రుడు జగన్ గెలుపు కోసం కూడా సాయమందించిన కేసీఆర్, ఇప్పుడు సొంత పార్టీని కాపాడుకోవడానికి మరొకరి సాయం కోరాల్సిన పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
క్యాడర్‌లో కంగారు
తెలంగాణలో బీఆర్‌ఎస్ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో గులాబీ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకుపోయిందని, రెట్టింపు స్పీడ్‌తో మళ్లీ వస్తుందని చెప్పి పార్టీ క్యాడర్‌లో ధైర్యం నింపే పనిచేశారు గులాబీ అగ్ర నేతలు. కానీ, రెట్టింపు స్పీడ్ కాదు కదా, స్టార్టింగ్ ట్రబుల్‌తో చతికిల పడిందని గుర్తించిన లీడర్లు పార్టీలో ఉన్నా లాభం లేదని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయినా కూడా కేసీఆర్ మౌనంగా ఉండడం హాట్ టాపిక్‌గా మారగా, ఈ మౌనం ఎన్నాళ్లు అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ క్లిష్ట సమయంలో కూడా కేవలం ఫాంహౌస్‌కే పరిమితమైతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుండగా అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయలేదు. ఈసారైనా ఆయన సమావేశాలకు వెళతారా లేదా? అనే ఉత్కంఠ కూడా నెలకొంది.