Revanth reddy cabinet green signal for farm loan waiver | Farm loans: రుణమాఫీ.. రైట్ రైట్
Gulf And Overseas Workers Welfare Board Soon CM Revanth Reddy
Political News, Top Stories

Farm loans: రుణమాఫీ.. రైట్ రైట్

– ఆమోదించిన తెలంగాణ కేబినెట్

– ఒకేసారి 2 లక్షలలోపున్న రైతుల రుణాలు మాఫీ

– 2023, డిసెంబరు 9లోపు రుణాలన్నీ రద్దు 

– 47 లక్షల మందికి చేకూరనున్న లబ్ది

– రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

– అసెంబ్లీలో చర్చ తర్వాత అమలు

– వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

– ప్రభుత్వ నిర్ణయంతో రైతుల సంతోషం 

Revanth Reddy: తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రూ. 2 లక్షల లోపు రైతు రుణాల మాఫీకి పచ్చజెండా ఊపింది. సీఎం అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన మంత్రివర్గం ఏకగ్రీవంగా 2023, డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న పంటరుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గంలో చర్చించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో క లిసి మీడియాకు వెల్లడించారు.

రాహుల్ వాగ్దానం మేరకే

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే కాంగ్రెస్ పార్టీ విధానం మేరకు రుణమాఫీపై నేడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ దేని గురించైనా వాగ్దానం చేస్తే వెనకడుగు వేయదని, పార్టీ నష్టపోతుందని తెలిసీ, సోనియా గాంధీ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారని సీఎం గుర్తుచేశారు.

2022 మే 6న జరిగిన వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారనీ, అదే మాటను తాము అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని, నాటి రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టేందుకే నేడు తెలంగాణ కేబినెట్ రుణమాఫీపై నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఏకకాలంలో రుణమాఫీ..

గత ప్రభుత్వం పదేళ్లలో రూ.28వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసిందని, 11డిసెంబర్ 2018 వరకు తీసుకున్న రుణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని, తమ ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తోందని, దీనికోసం రూ. 31 వేల కోట్లు వెచ్చించనున్నట్లు సీఎం తెలిపారు. ఏక కాలంలోనే రూ.2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వం రుణమాఫీ అమలుకు పదేళ్లు పట్టగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం కేవలం 8 నెలల కాలంలో దీనిని అమలు చేసి చూపబోతోందని పేర్కొన్నారు. రుణమాఫీపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు.

రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ 

రైతులకు పంటసాయంగా అందిస్తున్న సొమ్ము అనర్హులకు చేరుతోందని, కొన్ని చోట్ల రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా అందుతోందనే చర్చ ప్రజల్లో ఉందని అన్నారు. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అందించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించామని తెలిపారు. ఈ కమిటీ జూలై 15లోగా తమ నివేదికను ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందనీ, దీనిని అసెంబ్లీలో చర్చకు పెట్టి, విపక్షాల సలహాలనూ తీసుకుని, పారదర్శకంగా రైతు భరోసా పథకాన్ని అందించనున్నట్లు తెలిపారు.

పాలనా నిర్ణయాల వెల్లడి బాధ్యత వీరికే.. 

ప్రభుత్వ నిర్ణయాలపై కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, దీనివల్ల సమాజంలో అపోహలు కలిగే అవకాశముందని, దీనిని నివారించేందుకు ఇకపై.. మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యతను మంత్రులు.. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వారు ఇచ్చే సమాచారాన్నే ప్రామాణికమైనదిగా భావించాలని మీడియా సంస్థలకు సూచించారు.

రైతుల హర్షం..

రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే, ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.

పరిమితి: రూ. 2 లక్షల లోపు రైతురుణాలన్నీ ఒకేసారి మాఫీ

2018 డిసెంబర్ 12 – 2023 డిసెంబర్ 9 మధ్యలోని పంటరుణాలన్నీ మాఫీ

ఖజానాపై భారం: రూ. 31,000 కోట్లు

లబ్దిదారుల సంఖ్య: 47 లక్షలు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..