Singareni: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందని, బీజేపీ నీతిలేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బొగ్గు గనుల వేలంపై స్పందిస్తూ పేర్కొన్నారు. ఈ రెండు జాతీయ పార్టీలకు వేసిన ఓటు.. తెలంగాణ జాతి ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అని తెలిపారు. తెలంగాణ నేలపై సింగరేణి గొంతు కోస్తున్న వేళ అని వివరించారు. డిప్యూటీ సీఎం భట్టికి బాధలేదని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రంది లేదన్నారు. తెలంగాణ ప్రజలపై వీరికి ప్రేమ లేదని, సింగరేణి కార్మికులపై అభిమానమూ లేదని విమర్శించారు.
సింగరేణి గొంతు కోస్తుంటే ఇద్దరికీ పట్టలేనంత సంతోషం, ఆనందం ఉన్నదని, చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోనే వీరి కుమ్మక్కు కుట్రలకు నిదర్శనం అని ఆరోపించారు. ఈ వేలం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపులు జరిపేదని ప్రశ్నించారు. ఆరు నెలలైనా గ్యారెంటీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనా? అని పేర్కొన్నారు. సంక్షేమానికి పాతరేసి, అభివృద్ధినీ పాతాళానికి తొక్కి ఇద్దరూ వికృత క్రీడ ఆడుతున్నారని, తొమ్మిదేళ్లు కంటికిరెప్పలా కాపాడిన తెలంగాణ సహజ సంపదను చెరబట్టినందుకు కాంగ్రెస్, బీజేపీలను చరిత్ర ఎప్పటికీ క్షమించదని ట్వీట్ చేశారు.