MLA Mahipal Reddy: అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నాయని, ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేసి వేధిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్ మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లపై ఈడీ దాడుల నేపథ్యంలో హరీశ్ రావు స్పందిస్తూ సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో కొన్ని గంటలపాటు ఈడీ దాడులు చేసిందని, కానీ, ఒక్క అవినీతి ఆస్తుల ఆధారాలు దొరకలేదని అన్నారు. ఈ దాడులు కేవలం తమ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయాలనే లక్ష్యంతో జరిగినవేనని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నదని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికారపార్టీ బెదిరింపులకు పాల్పడుతున్నదన్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్నా.. కర్కశంగా ఈడీ దాడులు చేయడం దారుణం అని ఆక్రోశం వ్యక్తం చేశారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్నదని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు.
నీట్ పరీక్ష గురించీ హరీశ్ రావు మాట్లాడారు. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని, వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా అధికారులు ఎందుకు వారిపై యాక్షన్ తీసుకోవడం లేదని నిలదీశారు. మన రాష్ట్రంలో లక్ష కుటుంబాలకు చెందిన పిల్లలు నీట్ పరీక్ష రాశారని, వారి భవిష్యత్ అయోమయంలో ఉన్నదన్నారు