The Brain: అజయ్ (Ajay).. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. ‘ఖుషి’, ‘ఒక్కడు’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ నటుడిగా మారారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో ‘సారాయి వీర్రాజు’ సినిమాతో హీరోగానూ మారారు. ఆ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ ఆయన ఆ ప్రయత్నాలు చేయలేదు. మరోసారి ఆయన ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి నిర్మిస్తున్న సస్పెన్స్, క్రైమ్ చిత్రం ‘ది బ్రెయిన్’ (The Brain). ఈ సినిమాలో అజయ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా టీమ్ విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. బ్రెయిన్‌ని కత్తితో గుచ్చినట్లుగా ఈ పోస్టర్‌ని చూపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే ప్రధాన పాత్రలో నటిస్తున్న అజయ్ లుక్‌ని కూడా రివీల్ చేశారు. ఈ లుక్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్‌ని కలిగిస్తోంది. ఇందులో అజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందనే విషయాన్ని ఈ లుక్స్ తెలియజేస్తున్నాయి.
చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో
సస్పెన్స్, క్రైమ్ కథలను ప్రస్తుతం ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆడియెన్స్ ఇలాంటి జోనర్‌లో వచ్చే చిత్రాలకు సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల (Ashwin Kamaraj Koppala) ఓ అద్భుతమైన సస్పెన్స్, క్రైమ్ కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో అజయ్‌తో పాటు తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి వంటి వారంతా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల తెలిపారు.
సమాజంలో జరుగుతున్న పరిణామాలతో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ది బ్రెయిన్’ చిత్రాన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్‌లో వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ చిత్రానికి మాటలు పోతు గడ్డం ఉమా శంకర్ అందించారు. యూఎస్ విజయ్ కెమెరామెన్‌గా, ఎంఎల్ రాజా (ML Raja) మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి అవుట్ పుట్ అందిస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తుంది. ఆర్టిస్ట్‌లందరూ ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. అజయ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
