kcr in troubles with cases
Politics, Top Stories

Hyderabad:ముళ్ల బాటలో ..గులాబీ బాస్

  • వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్
  • కోడ్ ముగియగానే మొదలైన నోటీసుల పర్వం
  • విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఇప్పటికే నోటీసులు
  • త్వరలోనే కాళేశ్వరం అవకతవకలపై నోటీసులు
  • ఫోన్ ట్యాపింగ్ అంశంలో దూకుడు పెంచిన పోలీసులు
  • మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో అధికార దుర్వినియోగం
  • ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ పై కేటీఆర్ కు నోటీసులు
  • తీహార్ జైలులో తేలని కవిత భవిత

KCR facing illigal cases trouble to run own party :
ఒకప్పుడు జనాకర్షక నేతగా ప్రజల చేత గులాబీ పూలు చల్లించుకున్న నేత కేసీఆర్. ప్రస్తుతం వరుసగా రాళ్ల దెబ్బలు తింటూ ముందున్న మార్గమంతా ముళ్లబాటలో నడవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. పాపం ఆయన పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారయింది. అటు చూస్తే పార్టీనుంచి వలసలు వెళ్లే వారే తప్ప..కొత్తగా పార్టీలో చేరేవారే కరువయ్యారు. మునిగిపోయే నావలో ఎవరు మాత్రం రిస్క్ చేసి ఎక్కుతారు. అందుకే కొత్తగా చేరేవారు ఏ కాంగ్రెస్ లేదా బీజేపీ వైపే చూస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా అపరిమితమైన అధికారాలను అనుభవించిన కేసీఆర్ కు ఇప్పుడు కష్టకాలం దాపురించింది. ఆయనకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటం, కేంద్రంలో మోడీ సర్కారు ఏకంగా తన కూతుర్నే జైల్లో పెట్టడంతో కేసీఆర్‌ డిఫెన్స్‌లో పడిపోయారు.

చుట్టుముడుతున్న కేసులు

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కేసీఆర్ చుట్టూ చుట్టుముడుతున్న కేసులను చూస్తుంటే ఏ క్షణాన అయినా గులాబీ బాస్ జైలుకు వెళ్లే పరిస్థితి తప్పదని రాజకీయ పండితులు చెబుతున్న మాట. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం దగ్గర నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, చేప పిల్లల పంపిణీ, హరితహారంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు కేసీఆర్‌ మెడకు చుట్టుకునే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. సీబీఐ, ఈడీ కేసులతో తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత రెండు నెలలుగా ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు.

బెయిల్ కోసం ప్రయత్నాలు

కేటీఆర్‌, హరీశ్‌రావు బెయిల్‌ కోసం శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితి నిరాశాజనకంగానే ఉంటున్నది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక కేసీఆర్‌కు నోటీసుల పర్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మూడు అంశాల్లో ఆయన్ను విచారణకు పిలవనున్నారని తెలిసింది. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ పవర్ కొనుగోళ్ల అంశంపై 12 పేజీల వివరణ లేఖ సమర్పించారు కేసీఆర్. ఇక తదుపరి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలు విఫలమైన నేపథ్యంలో ఆయనకు జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ కమిషన్‌ నోటీసులు ఇవ్వనుంది. కాకపోతే ఈనెలాఖరులోగా నోటీసులు జారీకానున్నాయని తెలిసింది. ముందుగా అధికారులు, ఇతరులను విచారణకు పిలిచి, ఆ తర్వాతే కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌కూ నోటీసు ఇచ్చే పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్‌ నేతలే అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బందిని ప్రయివేటు సైన్యంలా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను, నేతలను టార్గెట్‌ చేశారనే ఆరోపణలు కేసీఆర్‌ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌ను టీడీపీలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అరెస్టయి జైల్లో కాలం గడుపుతున్న రాధాకిషన్‌రావు, ప్రవీణ్‌రావు, భుజంగరావు, తిరుపతన్న విచారణ సందర్భంగా కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఎస్‌ఐబీని అడ్డంపెట్టుకుని వ్యవహారాలను నడిపామని వాంగ్మూలం ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నది.

ఎఫ్ ఐ ఆర్ తప్పదా?

ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసి రాజీనామా చేసిన ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకోవడానికే హరీశ్‌రావును అమెరికా పంపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి సైతం విమర్శించిన విషయం విదితమే. కాగా విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో ట్రాన్స్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయా కేసుల విషయంలో కేసీఆర్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కేసీఆర్‌పై నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కానప్పటికీ, విచారణకు పిలిస్తే హాజరవుతారా ? లేక ఆ నోటీసులపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారా ? అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు