– సీఎం ఆలోచనలకు మంత్రి సీతక్క కార్యరూపం
– సచివాలయంలో రేపు రెండు క్యాంటీన్లు ప్రారంభం
Women Empowerment: పట్టణ, నగర ప్రాంతాల్లో పేదల ఆకలి తీర్చడానికి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు మంత్రి సీతక్క కార్యరూపాన్ని ఇచ్చారు. తొలిగా రెండు మహిళా శక్తి క్యాంటీన్లు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఈ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
గతంలో కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు నడిపిన అన్న క్యాంటిన్ల మాదిరిగా ఇక్కడ కూడా చౌకగా, మంచి భోజనాన్ని ప్రభుత్వం తరపున అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించాలని ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అడుగులు వేసింది. ఈ పథకం అమలు, నిర్వహణలో సమస్యలు వంటి అంశాలను లోతుగా పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. ఆ బృందాలతో సీఎస్ శాంతి కుమారి సమావేశమై వివరాలను చర్చించారు. తాజాగా రెండు క్యాంటీన్లను సచివాలయంలో ప్రారంభిస్తున్నారు.
ఇదిలా ఉండగా, స్కూల్ పిల్లలకు యూనిఫామ్‌లను సకాలంలో అందించిన మహిళలు, డీఆర్‌డీవోలకు మంత్రి సీతక్క బుధవారం అభినందనలు తెలిపారు. మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుందని, వారు సాధికారత సాధించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. డీఆర్‌డీవోలతో మహిళా శక్తి కార్యక్రమంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఐదేళ్ల రుణ ప్రణాళికనూ ఈ సందర్భంగా ఆమె ఆవిష్కరించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తామని, ఇందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యపడుతుందని తెలిపారు. అందుకే తమ ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్‌లను సకాలంలో కుట్టించి పంపిణీ చేసిన డీఆర్‌డీవోలకు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ పని సాధ్యం చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని పేర్కొన్నారు. ఆగస్టు 15న మరో జత యూనిఫామ్‌లు విద్యార్థులకు అందించేలా పని చేయాలని సూచించారు.