Minister Vivek: సాధారణంగా ఏ వ్యక్తి అయినా రాష్ట్ర మంత్రిగా కొనసాగాలంటే శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడిగా ఉండి తీరాలి. ఎమ్మెల్యే (MLA) లేదా ఎమ్మెల్సీ (MLC)గా ఉన్న వారే మంత్రిగా కొనసాగేందుకు రాజ్యాంగం వీలు కల్పించింది. అయితే తాజాగా తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజారుద్దీన్.. ప్రస్తుతం ఏ పదవిలోనూ లేరు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఆయన్ను నామినేట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన లేఖ ప్రస్తుతం రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ఏమన్నారంటే?
అజారుద్దీన్ కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే ఎమ్మెల్యే కోటాలో చేస్తామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి 6 నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవి చేపట్టాలని నిబంధన ఉన్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల లోపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లలో ఏదో ఒకటి కావాల్సి ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కేబినెట్ తీర్మానం చేసి పంపింది. గవర్నర్ ఆమోదించకపోతే.. ఆరు నెలల లోపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖాళీ అవుతుంది. అప్పుడు అజారుద్దీన్ ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని చేస్తాం’ అని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
తప్పుడు ఆరోపణలు
దేశం పరువు ప్రతిష్టలు దెబ్బతినేలా మ్యాచ్ ఫిక్స్ంగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అజారుద్దీన్ కు మంత్రి ఇవ్వడాన్ని తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి వివేక్ తాజాగా స్పందించారు. కిషన్ రెడ్డి మాటలకు అర్థం లేదని కొట్టిపారేశారు. అజారుద్దీన్ పై ఉన్న కేసులు ఏవి నిరూపణ కాలేదని స్ఫష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారన్న ఆరోపణలను సైతం మంత్రి కొట్టిపారేశారు. మైనార్టీ కోటాలో మంత్రి పదవులను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇందులో భాగంగానే అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టిందని చెప్పారు.
కేటీఆర్‌పై ఫైర్
మరోవైపు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ కు ఏం చేశారో కేటీఆర్ (KTR) చెప్పాలని మంత్రి వివేక్ సవాలు విసిరారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాని.. మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోవాలని సూచించారు. ‘అజారుద్దీన్ కు మంత్రి పదవి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేశాయి. ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే కోటాలోనైనా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని కొనసాగిస్తాం. ఇప్పటికే గవర్నర్ కోటాలో గవర్నర్ వద్ద హాజరుద్దీన్ ఫైల్ పెండింగ్లో ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అజారుద్దీన్ మంత్రి పదవికి ఆటంకాలు ఉండవు. కేటీఆర్ అబద్దాలతో రాజకీయాలు చేస్తున్నారు’ అని మంత్రి వివేక్ అన్నారు.
Also Read: Mohammad Azharuddin: నేనేంటో ప్రజలకు తెలుసు.. ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదు.. అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం
తెలంగాణ కేబినేట్ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర మంత్రుల సమక్షంలో అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆజారుద్దీన్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివించారు. దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చుట్టూ జరిగిన రాజకీయ వివాదానికి ముంగింపు పడినట్లైంది. అయితే అజారుద్దీన్ కు ఏ శాఖ ఇస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ మైనారిటీ సంక్షేమశాఖ ఇవ్వొచ్చన వాదన బలంగా వినిపిస్తోంది.
