Power Commission: తమ ప్రభుత్వ హయాంలో ఏ అవకతవకలూ జరగలేవని, అవసరమైతే ఏ విచారణకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తీరా కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు పిలిస్తే వచ్చేది లేదని ఇప్పుడు చెబుతున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసు పంపితే 12 పేజీ లేఖను రాసిన కేసీఆర్.. విచారణకు హాజరవ్వనని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై విమర్శలు సంధిస్తున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది మీరే కదా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలకు రూ. 38 వేల కోట్ల అప్పు తీరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐటీఐలకు పూర్వవైభవం తేవాలని సీఎం రేవంత్ చూస్తున్నారని వివరించారు. కాళేశ్వరం ఎస్సై తప్పు చేస్తే తమ ప్రభుత్వం శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించిందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ పవర్ కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని డిమాండ్ చేశారు.
విచారణకు హాజరు కాకుండా కమిషన్‌కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాయడమేంటని అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఎద్దేవా చేశారు. అదేమైనా ప్రేమ లేఖనా అని సెటైర్ వేశారు. అప్పుడేమో విచారణకు సిద్ధం అన్నారని, ఇప్పుడేమో విచారణకు రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ మేధావి కదా.. కమిషన్ ముందు హాజరు కావడానికి భయమేమిటీ? అని ప్రశ్నించారు.