Revanth Reddy: ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అమలు చేస్తున్న వ్యూహాలు విపక్ష బీఆర్ఎస్(BRS)కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా రేవంత్ రెడ్డి కదుపుతున్న పావులు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి కేవలం సెంటిమెంట్ ఆధారంగా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్ల క్షేత్ర స్థాయిలో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. నవీన్ యాదవ్(Naveen yadav) అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఆదరణ రెట్టింపు అయ్యిందని సర్వేల్లో తేలింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) వ్యవహారశైలి నచ్చక నియోజకవర్గ ప్రజల నుంచే కాకుండా సొంత కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లభించడం లేదనే చర్చ నడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, బలమైన నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యతను తెచ్చి పెడతాయన్న నమ్మకాన్ని శ్రేణులకు ఇస్తున్నాయి.
రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన వ్యూహాలను బీఆర్ఎస్ పసిగట్టే లోపే అవి చాపకింద నీరులా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. స్థానికంగా వాటిపైనే ప్రజలు చర్చించుకొనే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడి అన్ని డివిజన్ల బాధ్యతలను సీనియర్ మంత్రులకు అప్పగించి చేపట్టిన అభివృద్ధి పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా 3.98 లక్షల ఓటర్లలో లక్ష మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆయా లబ్ధిదారుల ఇళ్లకు కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు.
ఎంఐఎం కలిసిరావడంతో రాజకీయ విజయం
ఈ ఉప ఎన్నికలో ఎంఐఎం మద్దతును కూడగట్టడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎంఐఎంతో ప్రత్యేక చర్చలు చేసిన సీఎం, మద్దతును కూడగట్టడంతో సఫలీకృతమయ్యారు. నియోజకవర్గంలో బలైమన మైనార్టీలు గంపగుత్తగా కాంగ్రెస్(Congress) వైపు చూసేలా అమలు చేసిన వ్యూహం బీఆర్ఎస్(BRS)ను షాక్‌కు గురి చేసింది. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు చోటు దక్కలేదన్న విమర్శలకు చెక్ పెడుతూ అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించారు. తద్వారా రేవంత్ రెడ్డి విపక్షాల నోళ్లు మూయించగలిగారని అంటున్నారు.
Also Read: Maoists: తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నల్లమలలో మావోయిస్టుల సమావేశం!
ఇతర సామాజిక వర్గాలూ కాంగ్రెస్ వైపే..
జూబ్లీహిల్స్‌లో కమ్మ సామాజిక వర్గం కూడా కీలకమే. వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టేలా సీఎం రేవంత్ తన వ్యూహాలకు పదును పెట్టారు. గతంలో వీరు బీఆర్ఎస్ వైపు నిలిచారు. అయితే, కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌కు అహంకారపూరిత వైఖరి ఉన్నదని, అది నచ్చక ఆ వర్గం దూరమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి తుమ్మలను రంగంలోకి దింపిన సీఎం, వారు ఇతర పార్టీల వైపు చూడకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించేలా చేశారు. మరోవైపు, నియోజకవర్గంలో బలమైన యాదవ సామాజిక వర్గం వన్‌సైడెడ్‌గా నిలిచేలా సీనియర్లను కాదని నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించగలిగారు. దీంతో అన్ని బీసీ సంఘాలు కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేలా చేశారు. ముదిరాజ్ పోరాట సమితి, బీసీ సంక్షేమ సమితి వంటి సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడానికి ఇది కారణమైంది.
ప్రచారానికి ముందే వ్యూహాలు
జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా ఉండే సినీ కార్మికుల వేతనాల పెంపులో సీఎం రేవంత్ రెడ్డిది కీరోల్. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన కార్మిక సంఘాలతో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా చర్చలు జరిపించారు. అనంతరం వారి వేతనాల పెంపునకు చిత్ర పరిశ్రమ నిర్మాతలు అంగీకరించేలా చేశారు. దీనిపై సినీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఇటీవల రేవంత్ రెడ్డిని సన్మానించాయి. ఇలా రాజకీయంగా, అభివృద్ధి పరంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా పావులు కదిపిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికలో తన రాజకీయ చతురతను చాటుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో తన ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలపగలిగారని స్థానిక ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.
Also Read: Jubliee Hills Bypoll: ‘జూబ్లిహిల్స్ మీ అయ్య జాగీరా?’.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				