– వారి సాధికారత ప్రభుత్వ లక్ష్యం
– మహిళా సంఘాలకు రుణాలు పెంచుతాం
– మహిళా శక్తిని విజయవంతం చేయాలి
– కాంగ్రెస్ మహిళా పక్షపాతి
– డీఆర్‌డీవోలతో మంత్రి సీతక్క సమీక్ష
Women Empowerment: మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుందని, వారు సాధికారత సాధించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. డీఆర్‌డీవోలతో మహిళా శక్తి కార్యక్రమంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఐదేళ్ల రుణ ప్రణాళికనూ ఈ సందర్భంగా ఆమె ఆవిష్కరించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తామని, ఇందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యపడుతుందని తెలిపారు. అందుకే తమ ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్‌లను సకాలంలో కుట్టించి పంపిణీ చేసిన డీఆర్‌డీవోలకు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ పని సాధ్యం చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని పేర్కొన్నారు. ఆగస్టు 15న మరో జత యూనిఫామ్‌లు విద్యార్థులకు అందించేలా పని చేయాలని సూచించారు.
డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామని, ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రుణ సౌకర్యాన్ని కోట్ల రూపాయలకూ పెంచేలా కృషి చేస్తామని వివరించారు. కాంగ్రెస్ మహిళా పక్షపాతి అని, SERP కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు.
మహిళా శక్తి క్యాంటీన్లు
పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారుల వెంట, రద్దీ ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, రుచి, శుభ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కల్తీతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, అందుకే కల్తీ వస్తువులపై యుద్ధం చేయాల్సి ఉన్నదని, మహిళా శక్తి క్యాంటీన్లు క్వాలిటీపై రాజీ పడొద్దని సూచించారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మహిళలకు వడ్డీ లేనిరుణాలను అందిస్తున్నామని చెప్పారు.