– ట్రిపుల్ ఆర్‌పై కీలక విషయం వెల్లడించిన మంత్రి
– మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్
– రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులపై ఆదేశాలు
– ఫుల్ టైమ్ యాక్షన్‌లోకి దిగామన్న కోమటిరెడ్డి
health: ట్రిపుల్ ఆర్ విషయంలో కీలక విషయం వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన, రాబోయే రెండు మూడు రోజుల్లో ఆరోగ్యశాఖతో కలిసి మరోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌ను ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చారని, మూడున్నరేళ్లలో ట్రిపుల్ ఆర్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మతులు చేయాలని ఆదేశించామని వివరించారు. విజయవాడ రోడ్డు అనగానే డెత్ రోడ్డు అనే పేరు ఉందని, డిసెంబర్ లోపు సిక్స్ లేన్ రోడ్డు పనులను మొదలు పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. ఫుల్ టైం యాక్షన్‌లోకి దిగుతామని, కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారు.
తెలంగాణలో ఎక్కువ శాతం రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు కోమటిరెడ్డి. పార్లమెంట్‌లో కాంగ్రెస్ కూటమి బలంగా ఉందని, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పుకొచ్చారు. ‘‘ఉప్పల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్, అంబర్ పేట పనులు ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. మూడు నెలల్లో అంబర్ పేట పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశాం. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను 24 అంతస్తులతో నిర్మిస్తాం. డీపీఆర్ రెడీ అవుతోంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేవలం సెల్ఫీల కోసమే పనికొస్తోంది. ఒక గంట అక్కడ ఉంటే హాస్పిటల్ పాలు అవ్వడం ఖాయం. బకాయిలు అనేది పెద్ద సమస్య. అవి తీర్చడానికి కార్పొరేషన్ పెట్టి ముందుకు వెళ్తాం. మోదీతో కేసీఆర్ వ్యక్తిగత పంచాయితీ ఉన్నట్లుగా వ్యవహరించారు’’ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.