Cyclone Montha: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలను మెుంథా తుపాను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 60-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవాళ రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు తుపానుకు మెుంథా అనే పేరు ఎలా వచ్చింది? దానికి అర్థం ఏమిటి? ఎవరు సూచించారు? అసలు తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం ఎలా వచ్చింది? ఇప్పుడు చూద్దాం.
తుపానులకు పేర్లు ఎందుకు ఇస్తారు?
ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organisation – WMO) ప్రకారం.. ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా లేదా ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ తుపానులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చు. సహాయక చర్యలు చేపట్టడంలో రెస్క్యూ టీమ్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని నివారించేందుకు తుపానులకు పేర్లు పెట్టే విధానాన్ని అంతర్జాతీయంగా తీసుకొచ్చారు. దీని ద్వారా విపత్తు నిర్వహణలో గందరగోళం తగ్గి.. తుపాను నష్టాన్ని అంచనా వేయడం కూడా తేలిక అవుతుంది.
“మెుంథా’ అనే పేరుకు అర్థం ఏంటి?
‘మెుంథా (Montha)’ అనే పదం థాయి బాష నుంచి ఆవర్భివించింది. దీనికి అర్థం అందమైన లేదా సువాసన గల పువ్వు. ఈ పేరును థాయ్‌లాండ్ (Thailand) సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు (Regional Specialised Meteorological Centres – RSMCs), 5 ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరికా కేంద్రాలు (Regional Tropical Cyclone Warning Centres) ఉన్నాయి. తుపానులకు పేర్లు ఇవ్వడం హెచ్చరికలు జారీ చేయడం ఈ కేంద్రాల బాధ్యత.
తుపానులకు పేర్లు ఎలా నిర్ణయిస్తారు?
భారత వాతావరణ శాఖ (IMD) కూడా పైన పేర్కొన్న ప్యానెల్స్ లో భాగంగా ఉంది. హిందూ మహాసముద్రం (బంగాళాఖాతంతో కలిపి), అరేబియా సముద్రం తీరం డివిజన్ పరిధిలో మెుత్తం 13 దేశాలు ఉండగా అందులో భారత్ కూడా భాగస్వామిగా ఉంది. భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ, యెమెన్ దేశాలు.. ఆయా రీజియన్ లో సంభవించిన తుపానులకు పేర్లను సూచిస్తాయి. వాటిని రొటేషన్ పద్దతిలో తీసుకొని రిజనల్ స్పెషలైజేషన్ మెట్రోలాజికల్ సెంటర్.. తుపానులకు నామకరణం చేస్తుంటుంది. ఒకసారి ఉపయోగించిన పేరును మరోసారి వినియోగించరు.
Also Read: CYCLONE MONTHA: మరికొన్ని గంటల్లోనే ‘మొంథా తుపాను’ బీభత్సం.. ఈ ఏరియాల్లో ఉండేవారికి బిగ్ అలర్ట్
13 దేశాలు.. 169 పేర్లు
హిందూ మహాసముద్ర తీరం డివిజన్ లోని 13 దేశాలు ఇప్పటివరకూ 169 పేర్లను సూచించినట్లు సమాచారం. అయితే ఈ పేర్లు వ్యక్తులు, రాజకీయాలు, మతం, సంస్కృతులతో ప్రమేయం లేకుండా సూచించాల్సి ఉంటుంది. అరేబియా సముద్రంలో ఈ ఏడాది సంభవించిన తొలి తుపానుకు శ్రీలంక సూచించిన ‘శక్తి’ అనే పేరు పెట్టారు. అయితే ఇది భారత తీరానికి చేరకుండానే తన దిశ మార్చుకుంది. ఫలితంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు పెద్దగా ప్రభావితం కాలేదు.
