Tragedy Love Story: వారిద్దరు ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డుచెప్పారు. తమ ప్రేమ ఓడిపోకూడదని.. ప్రేయసి ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేసింది. నెల రోజులుగా కలిసే జీవిస్తున్నారు. చివరకి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సరిగ్గా 5 రోజుల్లో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ జంట ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. విధి వారి ప్రేమకు అర్ధంతరంగా ముగింపు పలికింది.
అసలేం జరిగిందంటే..
తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రేమికులు ఒక్కసారిగా మునిగిపోయారు. ప్రియుడి కళ్లముందే అతడి ప్రియురాలు మృతి చెందింది. గోదావరి ఖనిలోని సమ్మక్క – సారలమ్మ ఘాట్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రవితేజ – మౌనిక ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో మౌనిక ఇంటి నుంచి బయటకు వచ్చేసి రవితేజ ఇంట్లోనే నెల రోజులుగా ఉంటోంది. చివరకి పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. నవంబర్ 1న పెళ్లిని నిర్ణయించారు.
సంప్రదాయంలో భాగంగా..
సంప్రదాయంలో భాగంగా నగర శివారులోని సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద గోదావరి తీరంలో రవితేజ – మౌనిక జంట స్నానానికి వెళ్లారు. అయితే లోతైన ప్రదేశానికి వెళ్లడంతో వరద ప్రవాహానికి వారిద్దరు కొట్టుకుపోయారు. ఇద్దరు ప్రేమికులు కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు.. జాలర్ల సహాయంతో కాపాడే ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద రవితేజ. మౌనికలను ఒడ్డుకు చేర్చారు. అయితే ఆ లోపే మౌనిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రియుడు రవితేజ.. మౌనిక మృతదేహం వద్ద రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల బాదుకుంటూ అతడు బాధపడటం ప్రతీ ఒక్కరినీ ఆవేదనకు గురిచేసింది.
Also Read: Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. చివరికీ
గోదావరి ఖని విఠల్ నగర్ చెందిన రవితేజ.. సింగరేణిలోని బోరింగ్ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. పెద్దబొంకూరు గ్రామానికి చెందిన మౌనిక పదో తరగతి వరకూ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. రెండేళ్ల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో మౌనికతో రవితేజకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నెల క్రితం మౌనిక రవితేజ ఇంటికి వచ్చింది. మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా నవంబర్ 1న పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఇంతలోనే దారుణం జరగడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
