Huzurabad Gurukulam: విద్యార్థులపై ప్రిన్సిపాల్-పోలీసుల వేధింపులు?
సీసీ కెమెరాల ధ్వంసం కేసు విచారణలో విద్యార్థులపై దాష్టీకం
డ్రగ్స్ మాఫియాగా ముద్ర వేసి మానసిక చిత్రహింస!
హుజురాబాద్, స్వేచ్ఛ: వీణవంక మహాత్మ జ్యోతిరావు పూలే (ఎంజేపీటీబీసీడబ్ల్యూ) బాలుర గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాల ధ్వంసం కేసు దర్యాప్తు.. విద్యార్థులపాలిట శాపంగా మారింది. ఈ పాఠశాల ప్రిన్సిపాల్, ఒక పోలీస్ కానిస్టేబుల్ కలిసి విద్యార్థులపై వేధింపుల దిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత మూడు రోజుల్లో ఎదురైన మానసిక చిత్రహింస కారణంగా చిన్నారులు ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లారంటే, ఎంతలా ఇబ్బందులు పెట్టారో ఊహించుకోవచ్చు. పోలీస్ స్టేషన్‌లో కూడా దారుణం గురుకులంలో జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 18న పాఠశాలలో సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. నిందితులను కనిపెట్టడానికి ప్రిన్సిపాల్ అనుసరించిన పద్ధతి భయంకరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను, టెక్నీషియన్‌ను తీసుకొచ్చి విచారణ పేరుతో తమకు నరకం చూపించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 10వ తరగతి, 9వ తరగతి, ఇంటర్మీడియెట్‌కు చెందిన మొత్తం 16 మంది అమాయక విద్యార్థులను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి ‘మీరే దొంగలు, మీరే చేశారు!’ అని నిందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని చంపేసేలా మాట్లాడారని అంటున్నారు.
Read Also- Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?
సంచలన ఆరోపణలు
‘‘మీరు గంజాయి సరఫరా చేస్తున్నారు, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు!’’ అంటూ తమపై అసాంఘీక కార్యకలాపాల ముద్ర వేశారని అంటున్నారు. వీటికి తోడు బూతులు తిడుతూ, శారీరకంగా కొడుతూ ప్రిన్సిపాల్, కానిస్టేబుల్ పశువుల మాదిరిగా ప్రవర్తించారని బాధిత విద్యార్థులు కన్నీళ్లతో తమ తల్లిదండ్రులకు వివరించారు. ఈ వేధింపులను తట్టుకోలేక, కొంతమంది విద్యార్థులు ఇటీవల వంగరలో జరిగిన పీవీ రంగారావు బాలికల రెసిడెన్షియల్ స్కూల్ దురదృష్టకర ఘటన మాదిరిగానే ఆత్మహత్య చేసుకుంటామనే ఆలోచనల వరకు వెళ్లినట్టు తెలిసింది.
ప్రిన్సిపాల్‌పైనే అనుమానం?
సీసీ కెమెరాల ధ్వంసం కేసులో ప్రిన్సిపాల్ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. దీని వెనుక ఆయన హస్తమే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురుకులంలో ఉండాల్సిన ప్రిన్సిపాల్ ఏకంగా కరీంనగర్‌లో కాపురం పెట్టి, రోజూ అప్ అండ్ డౌన్ చేస్తుండడం, ఉదయం ఆలస్యంగా రావడం, సాయంత్రం 4 గంటలకే పారిపోవడం దినచర్య కావడం తొలి అనుమానంగా ఉంది. ఇక, సాయంత్రం 6 గంటలకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రోల్ కాల్‌ను కూడా ఆయన పట్టించుకోవడం లేదు. ప్రిన్సిపాల్ సమయపాలన లోపం, నిర్లక్ష్యం అన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అవుతాయి, అందుకే, ఆ నిర్లక్ష్యాన్ని దాచుకోవడానికే సీసీ కెమెరాలను ధ్వంసం చేయించి ఉంటుందని తల్లిదండ్రులు బలంగా అనుమానిస్తున్నారు.
Read Also- Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?
ఇంత జరుగుతున్నా, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ ఏమీ పట్టునట్టు వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. గురుకుల విద్యార్థులు ‘నరకం’ చూస్తుంటే, ఉన్నతాధికారులు కళ్లు మూసుకున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను వేధించిన ప్రిన్సిపాల్‌ను, ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురుకులాల్లో ఇలాంటి అమానుషాలు జరగకుండా ఉన్నతాధికారులు తమ నిర్లక్ష్యపు నిద్రను వీడి, పర్యవేక్షణను పెంచాలని అంటున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, ఈ దౌర్జన్య పాలనపై పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.
