– కేంద్రమంత్రి హోదాలో తొలిసారి స్వస్థలానికి బండి సంజయ్
– ఘనంగా స్వాగతించిన అభిమానులు, కార్యకర్తలు
– స్థానిక ప్రజల ఆశీర్వాదంతోనే కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి
– కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసిన బండి
Karimnagar MP: తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో సొంత నియోజకవర్గం కరీంనగర్‌కు వెళ్లిన బండి సంజయ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతించారు. కరీంనగర్ పరిధిలోకి ప్రవేశించగానే బండి సంజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన సొంతగడ్డకు చేరుకున్న తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నేలను ముద్దాడారు.
నగర శివారు నుంచే నీరాజనాలు
బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సొంత నివాసం నుంచి కరీంనగర్‌కు బయల్దేరి వెళ్లారు బండి సంజయ్. రాజధాని నగర శివారు నుంచే ఆయనకు నీరాజనాలు పలికారు బీజేపీ కార్యకర్తలు. సిద్దిపేట దాటిన తర్వాత కోహెడ మండలం శనిగరం గ్రామానికి చేరుకోగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కరీంనగర్ వరకు ర్యాలీగా చాలా మంది ఆయన వెంటే వాహనాల్లో వెళ్లారు. దీంతో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. టూర్ షెడ్యూల్ కూడా ఆలస్యమైంది.
కరీంనగర్, తెలంగాణకు నా సెల్యూట్
కరీంనగర్ చేరుకున్న తర్వాత బండి సంజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉన్నదని వివరించారు. ‘కరీంనగర్, తెలంగాణకు నా సెల్యూట్’ అని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగినట్టు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానంటే అది అమ్మవారి దయతోనే అని చెప్పారు. కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడ్డానని, వారికి అండగా ఉన్నందుకే తనకు ఈ పదవి దక్కిందని, ఈ గుర్తింపు తన కార్యకర్తలకే అంకితం అని వివరించారు. అనుభవించడానికో, డబ్బులు సంపాదించడానికో ఈ మంత్రి పదవిని ఉపయోగించుకోనని, కరీంనగర్‌కు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అందబాటులో ఉంటానని బండి స్పష్టం చేశారు.