Seethakka: గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లు అంగన్ వాడీ సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క (Seethakka) హెచ్చరించారు. అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో (డీడబ్ల్యూఓస్) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్షించారు. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలామృతం, మురుకులు, బియ్యం వంటి వస్తువుల సరఫరాపై జిల్లాలవారీగా సమీక్షించారు.
Also Read: Seethakka: క్యాబినెట్ భేటీపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు.. సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
కొన్ని జిల్లాల్లో సరఫరా 50 శాతానికి కూడా చేరకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల సంరక్షణలో అంగన్‌వాడీ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 90 శాతం లబ్ధిదారులు ఎఫ్ఆర్ఎస్ విధానంలో సరుకులు అందుకుంటుండగా, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.
విద్యా నాణ్యతా ఉండేలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల లోపు అంగన్వాడీ కేంద్రాలు తప్పనిసరిగా ప్రారంభం కావాలన్నారు. కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతి నెల కనీసం ఒక కొత్త చిన్నారి చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్లే స్కూళ్ల స్థాయిలోనే విద్యా నాణ్యతా ఉండేలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు. జిల్లా అధికారులు ప్రతి నెలా పురోగతి నివేదికలను సమర్పించాలదని ఆదేశించారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, బాల్య వివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. శక్తి సదనాలు, స్టే హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు. సమీక్షలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు.. మంత్రి సీతక్క వెల్లడి!
