Telangana Cabinet (imagecredit:swetcha)
తెలంగాణ

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..!

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటివరకు అమలులో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణను త్వరలో ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది.

ఈ క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానున్నది. ఆ రోజున హైకోర్టులో వెలువడే ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని క్యాబినెట్ భావిస్తున్నది. నవంబర్ 7న మరోసారి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది.

ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందే..

ఇక ప్రపంచంలోనే పొడవైన ఎస్ఎల్బీసీ(SLBC) సొరంగం పనులను పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మిగిలిన సొరంగం పనులను అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలన్నారు. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు మీడియాకు వివరించారు. మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ఆర్(YSR) ప్రారంభించిన గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించడంతో పాటు ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు క్యాబినెట్ అనుమతించినట్లు చెప్పారు.

Also Read: Iceland Mosquitoes: ఐస్‌లాండ్‌ చరిత్రలో తొలిసారి దోమల జాడ గుర్తింపు.. ఇది దేనికి సంకేతం?

అయితే, అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చిందన్నారు. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయిందని, ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయన్నారు. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని క్యాబినెట్ ఆమోదించినట్లు మంత్రులు చెప్పారు. 202627 ఏడాది నాటికి ఎస్‌ఎల్బీసీని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

టిమ్స్ స్పీడప్.. విద్యుత్ అంశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని క్యాబినెట్ చర్చించిందన్నారు. వరంగల్(Warangal) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Super specialty hospital), ఎల్బీనగర్(LB Nagar), సనత్‌నగర్,(Sanathnagar) అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాద‌న‌ల‌కు రాష్ట్ర క్యాబినెట్ సూత్రపాయ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్మాణ‌ల‌ను ఎక్కడ చేప‌ట్టాల‌నే దానిపై విద్యుత్ శాఖ త‌గిన నిర్ణయం తీసుకోవాల‌ని సూచించిందన్నారు.

మరోవైపు రామ‌గుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ (ఆర్‌టీఎస్‌బీ 62.5 మెగావాట్ల యూనిట్) కాల పరిమితి ముగిసినందున దానిని తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేండ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను క్యాబినెట్ ఆదేశించిందన్నారు. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని సూచించినట్లు చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?