The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఆమె నటించిన ‘థామా’ చిత్రం థియేటర్లలో మోత మోగిస్తోంది. ఈ సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌తో రష్మిక పేరు వైరల్ అవుతోంది. ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో నిశ్చితార్థం అయినట్లుగా వచ్చిన వార్తలతో రెండు మూడు రోజుల పాటు రష్మిక పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఆ వెంటనే ‘థామా’ రిలీజ్. ఇప్పుడామె నటిస్తున్న తెలుగు చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)కు సంబంధించిన అప్డేట్‌తో మరోసారి వార్తల్లోకి. ఎలా చూసినా, నిత్యం వార్తలలో ఉండాలనే సూత్రాన్ని మాత్రం రష్మిక బాగా ఫాలో అవుతుందనేది మాత్రం, ఆమె చర్యలను చూస్తుంటే అర్థమవుతోంది. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ విషయానికి వస్తే..
ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని వదిలారు. ఈ చిత్ర ట్రైలర్‌ను 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read- Tollywood dominance: ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుందా.. మన దర్శకులకు ఆ సత్తా ఉందా..
సరికొత్త ప్రేమ కథ..
ఈ పోస్టర్‌లో రష్మిక మందన్నాను, హీరో దీక్షిత్ శెట్టి ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నారు. రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకుంటున్న తీరు చూస్తుంటే తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ తర్వాత ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ట్రైలర్‌పై అందరిలో క్యూరియాసిటీ పెరుగుతోంది. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని, సినిమా సంచలన విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇకపై వరుస అప్డేట్స్ ఉంటాయని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో పాటు ‘మైసా’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలోనూ నటిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
